
లిబియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు, శిథిలాల కింద చిక్కుకుని దాదాపు 2వేల కంటే ఎక్కువ మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఖ్య 10వేలకు చేరవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే లిబియా తూర్పు నగరమైన డెర్నా శిథిలాలలో 15వందల కంటే ఎక్కువ మృతదేహాలను వెలికితీశారు. వరద నీరు ధాటికి ఆనకట్టలు ధ్వంసమై నగరాలను నాశనం చేయడంతో ఇది 5వేలకు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం లిబియా వాతావరణ పరిస్థితులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మృతదేహాలతో కూడిన సామూహిక సమాధిని చూపించే ఓ ఫొటోలో.. దాదాపు 15వందల కంటే ఎక్కువ శవాలు కనిపించాయి. సెప్టెంబర్ 12నాటికి వాటిలో సగం శవాలు ఖననం చేయబడ్డాయని తూర్పు లిబియా ఆరోగ్య మంత్రి చెప్పారు. ఒక్క డెర్నాలోనే 5,300 మందికి పైగా మరణించారని తూర్పు లిబియా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.