దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ(LIC ) రెండు కొత్త పథకాలను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి LIC జన్ సురక్ష యోజన, మరొకటి LIC బీమా లక్ష్మి యోజన. జన్ సురక్ష యోజన అనేది తక్కువ ఖర్చుతో అందిస్తున్న జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్). దీనికి అదనంగా పొదుపు (సేవింగ్స్) చేసే లాభం కూడా ఉంది. ఇది చిన్న, మధ్య తరగతి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది.
జన్ సురక్ష యోజన అంటే ఏంటి?
తక్కువ లేదా పరిమిత ఆదాయం ఉన్న వారికీ/కుటుంబాల కోసం తక్కువ ఖర్చుతో లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఈ చిన్న పథకాన్ని ఎల్ఐసీ రూపొందించింది. ఈ పాలసీ తీసుకున్న సమయంలో ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే నామినీకి బీమా మొత్తం డబ్బు వస్తుంది. ఒకవేళ పాలసీ ముగిసేవరకు (మెచూరిటీ) పాలసీదారుడు బతికి ఉంటే, అప్పటివరకు జమ చేసిన డబ్బు (హామీ మొత్తం) తో పాటు, సేవింగ్స్ ద్వారా వచ్చిన అదనపు లాభం కూడా వస్తుంది. అంటే ఆర్ధిక రక్షణతో పాటు డబ్బు సంపాదించేందుకు కూడా పనికొస్తుంది.
ముఖ్యమైన వివరాలు:
బీమా మొత్తం: కనీసం రూ. 1 లక్ష నుండి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ఉంటుంది.
పాలసీ కాలం (వ్యవధి): కనీసం 12 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు ఉంటుంది.
ప్రీమియం చెల్లింపు: పాలసీ కాలం ముగియడానికి ఐదు ఏళ్ల ముందు వరకు మాత్రమే ప్రీమియం కట్టాలి.
అర్హత: 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు.
ఈ పథకం ప్రత్యేకతలు:
*జన్ సురక్ష యోజన రెండు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. బీమా ద్వారా రక్షణ ఇంకా సేవింగ్స్ ద్వారా రాబడి.
*కనీసం మూడు ఏళ్లు వరుసగా ప్రీమియం కడితే, పాలసీదారుడికి ఆటోమేటిక్‌గా జీవిత రక్షణ (లైఫ్ కవర్) కొనసాగుతుంది.
*ఒక సంవత్సరం ప్రీమియం కట్టిన తర్వాత, పాలసీపై లోన్ (అప్పు) తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
జన్ సురక్ష యోజన అనేది బీమా రక్షణ, పొదుపు రెండింటినీ సులువుగా, తక్కువ ఖర్చుతో పొందడానికి ఒక మంచి మార్గం. తక్కువ ఖర్చుతో ఆర్థిక భద్రత కోరుకునే వారికి ఇది చాలా మంచి అప్షన్.
