‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ కనిపిస్తలే

‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ కనిపిస్తలే
  • యాప్, ట్విట్టర్, యూట్యూబ్ నుంచి తొలగించిన డిస్కవరీ
  • వరదలకు పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లు మునిగిన టైంలోనే ఇలా..
  • ప్రాజెక్టు డ్యామేజీ అయిందనే కారణంతోనే తీసే

హైదరాబాద్, వెలుగు: ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రూపొందించిన వీడియో డిస్కవరీ చానల్‌‌‌‌లో మాయమైంది. ‘‘ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్టుపై డిస్కవరీలో ప్రసారమైన డాక్యుమెంటరీ’’ అంటూ టీఆర్ఎస్ లీడర్లు తమ ట్విట్టర్ అంకౌంట్లలో షేర్ చేసిన లింక్‌‌‌‌లో ఇప్పుడు వీడియో కనిపించటం లేదు. ‘‘కాళేశ్వరం కానే కాదన్నరు. ఇప్పుడు అది రియాలిటీ. మన తెలుగు టీవీలు సక్కగ చూపిస్తలేవు గనీ.. వాడెవడో ఇంగ్లిష్ టీవీవోడు చూపిచ్చిండు మొన్న.. లిఫ్టింగ్ ఎ రివర్ అని చూపిచ్చిండు.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగామ్ అని చెప్పిన్రు..’’ అంటూ సీఎం కేసీఆర్ గతంలో డిస్కవరీ డాక్యుమెంటరీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియోను డిస్కవరీ చానల్ తమ యాప్ నుంచి, ట్విట్టర్ హ్యాండిల్, యూట్యూబ్ నుంచి తొలగించింది. డిస్కవరీ చానల్ ఇండియా యూట్యూబ్ హ్యాండిల్‌‌‌‌‌‌‌‌లో గత ఏడాది జూన్ 22న అప్​లోడ్ చేసిన ప్రొమో మాత్రమే ఉందంది. అసలు వీడియో మాత్రం కనిపించడం లేదు.

నాడు భారీ ప్రచారం.. 

కోటి ఎకరాలకు నీళ్లిచ్చే టార్గెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ వండర్ అని ప్రశంసలు కురిపిస్తూ దాదాపు 50 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీ రూపొందించారు. గతేడాది జూన్ 25న వివిధ స్లాట్లలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ సహా ఆరు భాషల్లో డిస్కవరీలో ప్రసారం చేశారు. 2017లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు మూడేండ్లలో నిర్మితమైందని వివరించారు. దీంతో కాళేశ్వరం గొప్పతనం ప్రపంచవ్యాప్తమైందంటూ టీఆర్ఎస్ ఈ డాక్యుమెంటరీని భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. అయితే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాకు అటాచ్ చేసిన లింక్​ను ఇపుడు క్లిక్ చేస్తే.. వీడియో కనిపించటం లేదు. ‘దట్ పేజ్ మూవ్‌‌‌‌‌‌‌‌డ్.. ఆర్ డస్ నాట్ ఎక్సిస్ట్’ అనే మెసేజ్ ప్రత్యక్షమవుతున్నది. ఇటీవల గోదావరి వరదకు కన్నెపల్లి, అన్నారం పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లు నీట మునిగాయి. ఏకంగా పంపులు ధ్వంసం కావటంతో దాదాపు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లింది. నెల రోజులైనా ఈ ఘటనపై ప్రభుత్వం పెదవి విప్పటం లేదు. కాళేశ్వరంతో చెప్పుకున్న గొప్పంతా గోదావరి నీళ్ల పాలైందని టీఆర్ఎస్ లీడర్లు కూడా మాట్లాడటం లేదు. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో డిస్కవరీ చానల్ కూడా ‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ వీడియోను డిలీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. వరదల్లో ప్రాజెక్టు డ్యామేజీ కావటంతోనే ఈ వీడియో లింక్‌‌‌‌‌‌‌‌లను ఆ చానల్ తొలగించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.