ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో కొత్త 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుతో ఏజెన్సీ గ్రామాల్లో వెలుగులు నిండాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జిల్లాలో పర్యటించి విద్యుత్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ములుగులో నిర్మిస్తున్న డిపార్ట్‌మెంటల్ ఎస్‌పీఎం షెడ్ పనులను పరిశీలించి జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ ఎస్‌పీఎం షెడ్‌ను సందర్శించి ఫెయిల్యూర్ ట్రాన్స్‌ఫార్మర్ల రికార్డులు, నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్లను వేగవంతం చేసి రోలింగ్ స్టాక్ పెంచాలని సూచించారు. అనంతరం గోవిందరావుపేట మండలం కర్లపల్లి, గుండాల అటవీ ప్రాంతాల్లో 27 కిలోమీటర్ల విద్యుత్ లైన్ పనులను పరిశీలించారు.
పస్రా సెక్షన్ పరిధిలో జరుగుతున్న పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని చెప్పారు. లింగాల 33/11కేవీ నూతన సబ్‌స్టేషన్‌తో గుండాల, కొడిశెల, లింగాల పరిసర ఏజెన్సీ గ్రామాలకు విద్యుత్ సరఫరా మెరుగవుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ నాణ్యత పెరిగి అంతరాయాలు తగ్గుతాయని, లో వోల్టేజ్ సమస్య కూడా ఉండబోదని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఈ రాజు చౌహన్, ఎస్ఈ బేతి బిక్షపతి, డీఈ నాగేశ్వర్ రావు, పురుషోత్తం, సదానందం, ఈఈ వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు.
