ఖజానాకు ఆమ్దానీ మందుతోనే!

ఖజానాకు ఆమ్దానీ మందుతోనే!

ఐదేండ్లుగా రాష్ట్ర ఆదాయానికి ఆబ్కారీనే పెద్ద దిక్కు
ఈ ఏడాది 12 వేల కోట్లకు చేరనున్న ఎక్సైజ్ డ్యూటీ
సేల్స్ టాక్స్ కూడా కలిపితే 30 వేల కోట్లకు చేరే చాన్స్
నిలకడగా పెట్రోల్, డీజిల్ సేల్స్ 
రిజిస్ట్రేషన్ల రాబడి ఈసారి అంతంతే
జీఎస్టీపైనే ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్

లిక్కర్‌‌తోనే రాష్ట్ర సర్కారు ఖజానాకు కిక్కెక్కుతోంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటోంది. గత ఐదేండ్లలో మద్యం రాబడి నాలుగు రెట్లు పెరిగింది. ప్రతి నెలా లిక్కర్‌‌ సేల్స్‌‌ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రం వచ్చిన కొత్తలో రూ. 3వేల కోట్లు ఉన్న ఎక్సైజ్​ డ్యూటీ ఆమ్దానీ.. ఈ ఏడాది రూ. 12 వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఎక్సైజ్‌‌ డ్యూటీతో పాటు లిక్కర్‌‌పై సేల్స్‌‌ టాక్స్‌‌ కలిపితే అది దాదాపు రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు ఎగబాకవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మాంద్యంతో ఈ ఏడాది వివిధ పద్దుల్లో రావాల్సిన ఆదాయం దెబ్బతిన్నా లిక్కర్‌‌ ఒక్కటే ప్రభుత్వానికి భరోసానిస్తోంది. ఇటీవల మద్యం షాపుల వేలం దరఖాస్తులతో రికార్డు స్థాయిలో రూ. 975  కోట్ల ఆమ్దానీ వచ్చింది. పట్నాలతోపాటు పల్లెల్లో మందుకు పెరిగిన గిరాకీని ఇది చాటిచెబుతోంది.

అవసరమైతే 5 శాతం రేట్లు పెంపు?

అవసరమైతే మద్యం రేట్లను ఐదు శాతం పెంచి ఆమ్దానీని రాబట్టుకోవాలని ఆబ్కారీ శాఖ ప్రపోజల్‌‌ ఫైల్‌‌ రెడీ చేసింది. ఈ ఫైల్‌‌  సీఎం వద్ద పెండింగ్‌‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిరుడు అక్టోబర్‌‌తో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే వెయ్యి కోట్ల ఆదాయం పెరిగిందని, అందుకే ఈసారి కూడా లిక్కరే ఖజానాకు సేఫ్‌‌ సైడ్‌‌గా ఉంటుందని వారు నమ్ముతున్నారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా పక్కనపెడితే..  రాష్ట్రానికి సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రధానంగా నాలుగు  పద్దులపైనే ఆధారపడి ఉంటుంది. అవి జీఎస్‌‌టీ, సేల్స్‌‌ టాక్స్, ఎక్సైజ్‌‌ డ్యూటీ,  స్టాంపులు రిజిస్ట్రేషన్​. వీటిలో మద్యం, పెట్రోల్, డీజిల్‌‌ ద్వారానే సగం ఆదాయం సమకూరుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఖజానా నింపిన నిధుల్లో సగం వాటా వీటిదేనని చెప్పుకోవచ్చు.

జీఎస్టీ తగ్గటంపై ఆందోళన

మద్యం తర్వాత రాష్ట్ర ఖజానాకు పెట్రోల్, డీజిల్‌‌ అమ్మకాలే లైఫ్​ లైన్‌‌.  గడిచిన నాలుగేండ్లుగా ఈ సేల్స్‌‌ నిలకడగానే ఉన్నాయని చెప్పుకోవాలి. వీటి ద్వారా గత ఏడాది రూ.20,290  కోట్లు ఆదాయం రాగా, ఈసారి మరో వెయ్యి కోట్లు పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇప్పుడున్న రాబడి చూస్తే ఇంచుమించుగా అదే పరిస్థితి కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌‌ ఉందని, నిరుటితో పోలిస్తే జీఎస్టీ రాబడి తగ్గిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.  జీఎస్‌‌టీ పరిహారం ఇవ్వాలంటూ ఇటీవల టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీలు  కేంద్రంపై ఒత్తిడి ప్రారంభించారు. నిరుడు ఇదే టైమ్‌తో పోలిస్తే ఈసారి జీఎస్టీ రూ. రెండు వేల కోట్లకుపైగా తగ్గిపోయింది.

రిజిస్ట్రేషన్ల టార్గెట్‌ కష్టమే

ఎక్సైజ్‌ ఆదాయం తర్వాత రాష్ట్రానికి ప్రధాన ఆదాయం రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపంలో వస్తుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి ఏడాది ఈ ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఐదేండ్ల కిందటితో పోలిస్తే రెట్టింపైంది. ఈ ఏడాది అంచనా వేసిన దానికి కంటే తక్కువగా వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 6,146 కోట్లు అంచనా పెట్టుకోగా.. ఇప్పటికి రూ. 3,716 .10 కోట్లు వచ్చాయి. ‘మరో నాలుగు నెలల్లో టార్గెట్‌ చేరటం కష్టమే. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌ లో ఇబ్బందులు తప్పవు. రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచితే ఖజానా నిండేందుకు ఢోకా ఉండదు’ అని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం వివిధ నగరాలు, పట్టణాల్లో నిర్ణయించిన భూముల ధరలపై 5.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజును వసూలు చేస్తున్నారు. ఈ ఫీజును ఒక శాతం నుంచి 2 శాతంగా పెంచే అవకాశం ప్రతిపాదనలో ఉందని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. దీనికి తోడు భూముల విలువను సవరించి ధరలను పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

రేట్ల పెంపు కోసం ప్రపోజల్‌!

పూర్తి స్థాయి కేబినెట్​ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ వివిధ అంశాలను స్టడీ చేసేందుకు మంత్రులతో ఎనిమిది కేబినెట్‌ సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు నేతత్వంలో ఏర్పాటు చేసిన ఆదాయ వనరుల సమీకరణ సబ్‌ కమిటీ ఇప్పటివరకు మూడు సార్లు సమావేశమైంది. అదనపు ఆదాయాన్ని సమకూర్చే మార్గాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఒత్తిడి పెంచే మార్గాలను  పరిశీలించింది. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ ఆదాయం పెంచితే మంచిదని, దీనికి తోడు రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచడం వల్ల అదనంగా ఆదాయం రాబట్టవచ్చనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ కమిటీ తమ రిపోర్టును త్వరలో సీఎం కేసీఆర్‌ కు సమర్పించనుంది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి