
జూబ్లీహిల్స్ రహ్మత్ నగర్ డివిజన్ నుంచి ఎల్బీ స్టేడియం లో జరుగుతున్న సామాజిక న్యాయ సమర భేరీకి వెళ్తున్న కార్యకర్తల బస్సులను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రహ్మత్ నగర్ అభివృద్ధి తన బాధ్యత అని.. ఇక్కడ డ్రైనేజి వ్యవస్థను గాడిలో పెడతానని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తీసుకొచ్చి రహ్మత్ నగర్ డివిజన్ ను అభివృద్ధి చేస్తానని అన్నారు మంత్రి వివేక్.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెరవేరుస్తున్నామని అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని.. ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు మంత్రి వివేక్.ఇదిలా ఉండగా శుక్రవారం ( జులై 4 ) ఎల్బీ స్టేడియంలో సామజిక న్యాయ సమరభేరీ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సభలో ,మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం కార్యకర్తల కష్టమేనని అన్నారు.
సాధ్యం కాదు అనుకున్న దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు సుసాధ్యం చేశారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఊహించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు.
కేసీఆర్, బీజేపీ కలిసి కాంగ్రెస్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.. కానీ తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను ఓడించారని విమర్శించారు. హైదరాబాద్లో ఉన్న పెద్ద పరిశ్రమలను మోడీ తీసుకురాలేదని.. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్కు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. 11 ఏళ్లలో మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు.