తెలంగాణలో విజయం కార్యకర్తల కష్టమే.. అసాధ్యం అనుకుంటే సుసాధ్యం చేశారు: ఖర్గే

తెలంగాణలో విజయం కార్యకర్తల కష్టమే.. అసాధ్యం అనుకుంటే సుసాధ్యం చేశారు: ఖర్గే

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం కార్యకర్తల కష్టమేనని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. సాధ్యం కాదు అనుకున్న దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు సుసాధ్యం చేశారన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఊహించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. శుక్రవారం (జూలై 4) ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభ నిర్వహించింది. 

ఈ సభకు ముఖ్య అతిథి మల్లికార్జున ఖర్గే హాజరై ప్రసగించారు. కేసీఆర్, బీజేపీ కలిసి కాంగ్రెస్‎ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.. కానీ తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను ఓడించారని విమర్శించారు. హైదరాబాద్‎లో ఉన్న పెద్ద పరిశ్రమలను మోడీ తీసుకురాలేదని.. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‏కు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. 11 ఏళ్లలో మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. 

ALSO READ | నేతలు ఇష్టారీతిగా మాట్లాడొద్దు.. పీసీసీ సమావేశంలో ఖర్గే స్వీట్ వార్నింగ్

మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, రూ.15 లక్షలు, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తానన్నాడు.. ఇచ్చాడా..? అని ప్రశ్నించిన ఖర్గే.. మోడీ ప్రజలకు చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ చెప్పిన ప్రతిది చేసి తీరుతుందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేస్తోందని కొనియాడారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఫ్రీ బస్, సన్న బియ్యం వంటి అనేక పథకాలు హామీలు అమలు చేస్తోందన్నారు. దేశంలో రేషన్ ద్వారా సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేశామని.. రాహుల్ చెప్పిన మాటకు ఇదే నిదర్శమన్నారు.

బీసీలకు 41 శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని.. 9వ షెడ్యూల్ లో చేర్చేదాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాలను రేవంత్ రెడ్డి సర్కార్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి కాంగ్రెస్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.