
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టారీతిన మాట్లాడొద్దని.. పార్టీ లైన్‌కు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని అన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. తెలంగాణ పర్యటనకు వచ్చిన ఖర్గే.. శుక్రవారం (జూలై 4) టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా పని చేయాలని రాష్ట్ర నాయకత్వా్న్ని ఆదేశించారు.
పార్టీ కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పని చేయాలని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలు పబ్లిక్‌గా మాట్లాడి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దన్నారు. ఏది ఉన్న పార్టీ అంతర్గత సమావేశాల్లోనే మాట్లాడాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ బై పోల్, లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా అందర్ని కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
పార్టీ కార్యకర్తలపై గత ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తేయాలని కోరారు. నామినేటేడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు పదవులు ఇవ్వాలని సూచించారు. ఇక, పీసీసీ సమావేశంలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఖర్గే సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది.
నలుగురు అయిదుగురు ఎమ్మెల్యేలు గ్రూపులు కడితే భయపడతామనుకుంటున్నారా అని హాట్ కామెంట్స్ చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేను, రాహుల్ గాంధీ పట్టించుకోమని పేర్కొన్నారు. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీజేపీ 11 ఏళ్ల పాలన ఎమర్జెన్సీ అని.. దీనిపై ఆ పార్టీ నేతలు మాట్లాడాలని డిమాండ్ చేశారు ఖర్గే.