
హైదరాబాద్: ప్రధాని మోడీపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. 42 దేశాలు తిరిగానని గొప్పులు చెప్పుకునే మోడీ.. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌కు ఎందుకు వెళ్లడం లేదు..? మణిపూర్ వెళ్లే తీరిక లేదా..? లేక మణిపూర్ భారత్‌లో అంతర్భాగం కాదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం (జూలై 4) ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభ నిర్వహించింది. ఈ సభకు మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఆల్ పార్టీ మీటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పాం. కానీ కీలకమైన ఆల్ పార్టీ మీటింగ్ కు ప్రధాని మోడీ హాజరు కాలేదు. మేం దేశం కోసం ఆలోచిస్తుంటే మోడీ ఎన్నికల కోసం చూస్తున్నారు.
ALSO READ | తెలంగాణలో విజయం కార్యకర్తల కష్టమే.. అసాధ్యం అనుకుంటే సుసాధ్యం చేశారు: ఖర్గే
మోడీకి బీహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదు. పాకిస్తాన్ ను అంతం చేస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ నేతలు.. యుద్ధాన్ని మధ్యలో ఎందుకు ఆపారు..? ఇందిరాగాంధీ పాకిస్థాన్ ను రెండు ముక్కులు చేశారు.. మరీ మోడీ ఏం చేశారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
గాంధీ కుటుంబంలో దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన వాళ్లు ఉన్నారు.. మరీ బీజేపీ దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ లో అలాంటి వాళ్లు ఉన్నారా..? పాక్, భారత్ యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే అంటుంటే మీరు ఎందుకు నోరు మూసుకున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదు.
అమెరికాకు వ్యతిరేకంగా ఇందిరా పోరాడింది. ఇందిరా గాంధీ ఎవరికి తలవంచలేదు.. యుద్ధంలో చూసుకుందామని సవాల్ చేసింది. మోడీ పాలనలో భారత్‌కు మిత్ర దేశాలు అన్ని దూరమయ్యాయి’’ అని ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు మల్లికార్జున ఖర్గే.