
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ లేట్ కావడంతో మద్యం లైసెన్స్‌లను ప్రభుత్వం నెల పాటు పొడిగించింది. ఈ ఒక్క నెలకు సరిపడా లైసెన్స్ ఫీజు చెల్లించి మద్యాన్ని తీసుకోవచ్చని షాపుల యజమానులకు తెలిపింది. మొదటి ఇండెంట్ నుంచే 13.5 శాతం మేర ఎక్సైజ్ టర్నోవర్ ట్యాక్స్‌ను చెల్లిస్తేనే మద్యం సరఫరా చేస్తామని పేర్కొంది. దీనిపై మద్యం షాపు ఓనర్లు నిరసన వ్యక్తంచేశారు. దీంతో లైసెన్స్ రెన్యూవల్‌కు డీలర్లు వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారులు, కానిస్టేబుళ్లు రంగంలోకి దిగి లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని బలవంతపెట్టినట్లు తెలిసింది. దసరా, దీపావళి పండుగ వేళల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముకున్నా పట్టించుకోమని అధికారులు హామీ ఇచ్చారని, దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో లైసెన్స్రెన్యూవల్ చేసుకున్నట్లు వైన్స్ డీలర్లు చెబుతున్నారు.