లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ ‘స‌డ‌లింపు’: కంపెనీలు, ఉద్యోగులు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు

లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ ‘స‌డ‌లింపు’: కంపెనీలు, ఉద్యోగులు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ వ్యాప్తంగా మే 3 వ‌ర‌కు లాక్ డౌన్ ను పొడిగించింది కేంద్ర ప్ర‌భుత్వం. అయితే ఈ నెల 20 నుంచి క‌రోనా కేసులు త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో కొన్ని ర‌కాల ప‌నులు చేసుకునే వీలు క‌ల్పిస్తూ బుధ‌వారం ఉద‌యం కేంద్ర హోం శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. వ్య‌వ‌సాయం, దాని అనుబంధ ప‌రిశ్ర‌మ‌లు, ఎంఎస్ఎంఈలు, ఐటీ స‌ర్వీసెస్, నిర్మాణ ప‌నుల‌ను స్టార్ట్ చేయ‌వ‌చ్చ‌ని, అయితే ప‌రిమిత సంఖ్య‌లో వ‌ర్క‌ర్స్ ని మాత్ర‌మే అనుమ‌తించాల‌ని సూచించింది. స్కూళ్లు, కాలేజీలు, థియేట‌ర్లు, స‌భ‌లు, మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి వీల్లేదు. అయితే క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న‌ హాట్ స్పాట్స్ లో మాత్రం లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లు చేయాల్సిందేన‌ని ఆదేశించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఆ ప్రాంతాల్లో జ‌న‌సంచారం కూడా లేకుండా నిత్యావ‌స‌రాలు కూడా డోర్ డెలివ‌రీ చేయాల‌ని సూచించింది.

  • లాక్ డౌన్ ఆంక్ష‌ల స‌డ‌లింపుతో ప‌నులు ప్రారంభించే ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు, వ్య‌వ‌సాయ ప‌నుల‌కు వెళ్లే వాళ్లు ఇంకెవ‌రైనా స‌రే కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందేని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచిస్తున్నారు.
  • ఇళ్లు దాటి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ ఫేస్ మాస్క్ క‌ట్టుకోవాల్సిందేన‌ని అన్ని ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే ఆదేశించాయి. ఆఫీసులు, కంపెనీల్లో ప‌ని చేసేట‌ప్పుడు కూడా మాస్క్ ఉంచుకోవ‌డం మంచిది.
  • ఉద్యోగులు, కార్మికులు డ్యూటీలోకి వ‌చ్చేట‌ప్పుడు ఎంట్రెన్స్ లోనే టెంప‌రేచ‌ర్ స్క్రీనింగ్ చేయ‌డంతోపాటు, శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచ‌డం త‌ప్ప‌నిస‌రి అని యాజ‌మాన్యాల‌కు ప్ర‌భుత్వం సూచించింది.
  • వ‌ర్క్ ప్లేస్ లో సామాజిక దూరం పాటిండం త‌ప్ప‌నిస‌రి. ద‌గ్గ‌ర ద‌గ్గ‌రగా ఉండి మీటింగ్స్ లాంటివి పెట్ట‌కూడ‌ద‌రు.
  • షిఫ్టుల మార్పిడిలోనూ ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఒక షిఫ్ట్ పూర్త‌య్యాక మ‌రో షిఫ్ట్ ఉద్యోగులు రావ‌డానికి క‌నీసం గంట గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
  • ఉద్యోగులంతా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా కంపెనీల యాజ‌మాన్యాలు చర్య‌లు తీసుకోవాలి. ఈ యాప్ ఫోన్ లో ఉంటే స‌మీపంలో ఎవ‌రైనా క‌రోనా పేషెంట్ ఉంటే వెంట‌నే అల‌ర్ట్ వ‌స్తుంది.
  • కార్మికులు, ఉద్యోగులు కంపెనీకి ద‌గ్గ‌ర‌లో లేదా అక్క‌డే ఏర్పాటు చేసిన వ‌స‌తిలో ఉండ‌డం మంచిది. ఇక ప్ర‌జార‌వాణా అందుబాటులో లేనందున ఆయా సంస్థ‌లే ఉద్యోగుల‌కు ర‌వాణా ఏర్పాట్లు చేయాలి.