మణిపూర్లో హింస.. రెండోరోజు దద్దరిల్లిన సభ .. లోక్సభ వాయిదా

మణిపూర్లో హింస.. రెండోరోజు దద్దరిల్లిన సభ .. లోక్సభ వాయిదా

మణిపూర్ లో హింసపై రెండోరోజు లోక్ సభ దద్దరిల్లింది. మణిపూర్ అంశంపై చర్చ  చేపట్టాలని ప్రతిపక్షాలు నినాదాలతో  హోరెత్తి్ంచాయి.  స్పీకర్ ఓం బిర్లా చర్చ చేపడతామని, సభకు సహకరించాలని చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు.   మణిపూర్ అంశంపై  హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని స్పీకర్ అంటే.. ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని విపక్షాలు  డిమాండ్ చేశాయి. 

దీంతో గందరగోళం మధ్య   రెండోరోజు సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు వరకు సభను వాయిదా వేశారు స్పీకర్.  మరోవైపు రాజ్యసభ కూడా వాయిదా పడింది. మణిపూర్ అంశంపై సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావు రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ నోటీసును సస్పెండ్ చేశారు.

మణిపూర్‌పై చర్చ జరగాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. మణిపూర్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ అంశం సున్నితమైనదని, ఈ అంశంపై చర్చ జరిగితే కేంద్ర హోంమంత్రి సమాధానం చెబుతారన్నారు. దీనిపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలను అభ్యర్థించారు, ఇది మహిళల గౌరవానికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు.