- పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
- నీట్ పేపర్ లీక్‌పై నిలదీసిన ప్రతిపక్ష ఎంపీలు
- అయోధ్య ‘చందాల చోరీ’పై చర్చకు పట్టు
- ఆరు సార్లు వాయిదా పడిన ఉభయ సభలు
- రోజు మొత్తంలో అరగంట కూడా సాగని లోక్ సభ
- సెకన్ల వ్యవధిలోనే పలుమార్లు రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే నీట్ పేపర్ లీక్, అయోధ్య రామ మందిరంలో ‘చందాల చోరీ’ వంటి అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనికి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయడంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ సభలో ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షాల సభ్యుల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు ఆరు సార్లు వాయిదా పడ్డాయి. అయినా సభలో చర్చ జరిపే అవకాశం లేకపోవడంతో ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ... ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. ఇంతలో ప్రతిపక్ష సభ్యులు నీట్ పేపర్ లీక్, రామ మందిరంలోని విరాళాల దొంగతనం అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలపై వెంటనే చర్చ జరపాలని నినాదాలు చేశారు. తమ స్థానాల్లో నుంచి లేచి నినాదాలతో హోరెత్తిస్తుండడంతో సంయమనం పాటించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. నినాదాలతో సభ పనిచేయలేదని, సభా కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని వారిని కోరారు.
అరగంట కూడా సాగలే..
తొలిరోజు లోక్ సభ సమావేశాలు మొత్తంగా అరగంట కూడా సాగలేదు. సభ ప్రారంభమైన తర్వాత 13 నిమిషాల పాటు కొనసాగింది. విపక్షాల నిరసనల కారణంగా స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం కాగానే ఓవైపు ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తున్నప్పటికీ న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో ఆరు నిమిషాల తర్వాత ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా సభను మధ్యాహ్నం12:30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో ఐదు నిమిషాల్లోనే మధ్యాహ్నం 1 గంటకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి కొనసాగడంతో ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా రెండు నిమిషానల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో... విపక్షాలు పట్టుబట్టడంతో సభను ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ మూడు నిమిషాల్లోనే మధ్యాహ్నం 2:30 గంటలకు, ఆపై మధ్యాహ్నం 3 గంటలకు, ఆ తర్వాత మరో రెండు నిమిషాల్లోనే మంగళవారానికి వాయిదా వేశారు.
పెద్దల సభలో సెకన్లలో వాయిదా..
రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. రాజ్యసభను చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన తొమ్మిది మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు నీట్ పేపర్ లీక్, అయోధ్య చందాల చోరీపై చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ ఎంతవారించినప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు పట్టువీడలేదు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ... జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు. దీంతో చైర్మన్ రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను ఒక్క నిమిషంలోనే మధ్యాహ్నం 12:30 గంటలకు, ఆపై మధ్యాహ్నం 12:50 గంటలకు, ఆ తర్వాత కూడా సభలో అదే సీన్ కొనసాగడంతో 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం 2:30 గంటలకు, ఆ తర్వాత మంగళవారానికి వాయిదా వేశారు.
ఖర్గే ఛాంబర్‌లో ప్రతిపక్ష ఎంపీల భేటీ
అంతకుముందు ప్రతిపక్షాలన్నీ సమావేశం అయ్యాయి. రామ మందిర విరాళాల అక్రమాలు, విద్యా వ్యవస్థ 'కుప్పకూలడం' వంటి పలు అంశాలపై ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరాలని ఇండియా బ్లాక్ నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందు, తమ వ్యూహాన్ని చర్చించేందుకు విపక్ష పార్టీల ఎంపీలు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు. “2015 నుంచి 152 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి, 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పక తొలగించాలి” అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, గౌరవ్ గొగోయ్, జైరాం రమేశ్, సుప్రియా సూలే, సాగరికా ఘోష్, సంజయ్ రౌత్, జాన్ బ్రిట్టాస్‌తో సహా ఇండియా బ్లాక్ పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
