హైదరాబాద్: ‘మేం వైన్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నాం.. మీరు ఒక్క వైన్ బాటిల్ పై పెట్టుబడి పెట్టిండి. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తాం. కొందరిని జాయిన్ చేస్తే మీకు నెలానెలా జీతం కూడా ఇస్తామంటూ బుట్టలో వేసుకొని కోట్లు కొల్లగొట్టారు. మంచిర్యాల జిల్లాలో ‘వైన్’బాటిల్ కొనుగోలు పేరిట కొందరు అక్రమార్కులు కోట్ల రూపాయలు దోచేశారు. ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ఈ వైన్ గ్రూప్ బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది.
వాట్సాప్ గ్రూప్ తో మొదలై..
ది వైన్ గ్రూప్ పేరుతో తొలుత వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. తెలిసిన వారందరినీ అందులో యాడ్ చేశారు. ఒక లింక్ పంపించారు. ఒక్క వైన్ సీసా కొనుగోలు చేస్తే దానికి 60 రోజుల్లో మూడురెట్లు ఇస్తామని నమ్మబలికారు. రూ.85 వేలుపెడితే ప్రతిరోజూ రూ.12,300 చొప్పున అందిస్తామని చెప్పారు. కొద్దిరోజుల పాటు పరిమిత మందికి అందించారు. దీని కోసం ఒక ప్రత్యేకమైన యాప్ రూపొందించారు. గోవాలో యాజమాన్యం ఉందంటూ రిమోట్ చేశారు. 230 మందిని సభ్యులుగా చేర్చిన వారికి రూ.20 వేల జీతం ఇస్తామని నమ్మబలికారు. దీంతో సభ్యుల సంఖ్య వందల నుంచి వేలకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో లక్షలకు చేరింది. పెట్టుబడుల సేకరణ కూడా కోట్లకు దాటిపోయింది. మే 30వ తేదీ వరకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా సాగిన వ్యవహారం ఒక్క సారిగా ఆగిపోయింది. ఏమిటని నిర్వాహకులకు ఫోన్ చేస్తే తాము గోవాలో ఉన్నామని కొందరు, ముంబైలో ఉన్నామని మరికొందరు బదులిచ్చారు. దీంతో మోసం జరిగిందని భావించిన బాధితులు లబోదిబోమంటున్నారు.
బాధితుల్లో మంచిర్యాల జిల్లావాసులు
మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న వారు తమకు తెలిసిన వారి ద్వారా ఈ గ్రూపులో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. రెడ్డి కాలనీకి చెందిన ఒక మహిళ ఏకంగా రూ.10 లక్షలు వైన్ గ్రూపులో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. కేవలం ఆమె పెట్టుబడి పెట్టడమే కాకుండా, ఆమె కింద మరి కొందరిని చేర్పించారు. ఇక పట్టణానికి చెందిన ఓ వ్యాపారి సైతం రూ. 4 లక్షల వరకు పెట్టారు. తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది.
