జీడిమెట్ల: రన్నింగ్లో మంటలు చెలరేగి లారీ దగ్ధం

జీడిమెట్ల: రన్నింగ్లో మంటలు చెలరేగి లారీ దగ్ధం
  •     హజార్డస్ ​వేస్ట్​ను తరలిస్తుండగా దుండిగల్​ ఓఆర్ఆర్​ వద్ద ఘటన

జీడిమెట్ల, వెలుగు: ప్రమాదకర రసాయన ఘన వ్యర్థాల(హజార్డస్​ వేస్ట్)ను తీసుకెళ్తున్న  ఓ లారీ అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటన దుండిగల్​ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాంకీ వేస్ట్​మేనేజ్​మెంట్​ప్లాంట్​కు చెందిన లారీ గురువారం సాయంత్రం ఘన వ్యర్థాలను పటాన్​చెరు నుంచి దుండిగల్​కు తీసుకెళ్తోంది. 

ఔటర్​రింగ్​రోడ్డు దుండిగల్​ఎగ్జిట్​నంబర్​5 వద్దకు రాగానే ఒక్కసారిగా లారీలోని హజార్డస్​ వేస్ట్​లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్​లారీని పక్కకు ఆపాడు. కానీ, మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనం వెనకభాగం దగ్ధమైంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లేసరికి లారీ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదకర వ్యర్థాలను నిర్లక్ష్యంగా తీసుకెళ్లడం ఏంటని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.