లాటరీ కింగ్ మార్టిన్ ఫ్యామిలీకి జాక్‌‌‌‌‌‌‌‌పాట్!.. మూడు వేర్వేరు పార్టీల తరపున ముగ్గురి విజయం

లాటరీ కింగ్ మార్టిన్ ఫ్యామిలీకి జాక్‌‌‌‌‌‌‌‌పాట్!.. మూడు వేర్వేరు పార్టీల తరపున ముగ్గురి విజయం

న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో ‘లాటరీ కింగ్’  శాంటియాగో మార్టిన్ కుటుంబ సభ్యులు ముగ్గురు వేర్వేరు పార్టీల తరపున  గెలిచారు. మార్టిన్ భార్య లీమారోజ్‌‌‌‌‌‌‌‌ మార్టిన్ లాల్గుడి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. టీవీకే అభ్యర్థి కృష్ణన్‌‌‌‌‌‌‌‌పై 2,739 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

ఇక శాంటియాగో మార్టిన్ అల్లుడు, టీవీకే చీఫ్ సెక్రటరీ ఆధవ్ అర్జున విల్లివాక్కం నియోజకవర్గంలో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆయన డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్‌‌‌‌‌‌‌‌పై 17,302 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అన్నాడీఎంకే అభ్యర్థి విజయకుమార్ ఇక్కడ మూడో స్థానానికే పరిమితమయ్యారు. 

పుదుచ్చేరిలోనూ మార్టిన్ మార్క్

శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పుదుచ్చేరి రాజకీయాల్లోను తనదైన ముద్ర వేశారు. ఆయన తన సొంత పార్టీ లచ్చియ జననాయక కచ్చి (ఎల్‌‌‌‌‌‌‌‌జేకే) తరపున కామరాజ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. 

గతంలో జోస్ చార్లెస్ మార్టిన్ బీజేపీలో ఉండేవారు. సీట్ల  కేటాయింపులో ఆలస్యం కారణంగా ఆ పార్టీని వీడారు. అనంతరం ఎల్‌‌‌‌‌‌‌‌జేకేను స్థాపించారు. అయినప్పటికీ, ప్రధాని మోదీ విజన్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలపై తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. తమ కుటుంబం రాజకీయాలను ప్రభావితం చేస్తోందన్న విమర్శలను తోసిపుచ్చారు, ప్రజల జీవితాలను మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.