- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మంథని, వెలుగు : ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఆదివారం వెలుగుచూసింది. ఏసీపీ మడత రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ (31) ఏప్రిల్ 30వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు నాలుగు రోజుల పాటు వెదికినా వంశీ జాడ తెలియకపోవడంతో గోదావరిఖని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వంశీ కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ మొదలుపెట్టి.. సింగిరెడ్డిపల్లికే చెందిన యువతితో పాటు ఆమె భర్త, మరో యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. వంశీకి, అదే గ్రామానికి చెందిన యువతితో గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. యువతి ఇటీవల గ్రామానికి రావడం, వంశీని కలవడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి.
ఈ విషయం యువతి భర్త నీలం నవీన్‌కు తెలియడంతో వంశీని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 30న వంశీని హైదరాబాద్‌కు పిలిపించిన నవీన్.. తన స్నేహితుడైన బుర్ర భాస్కర్ గదికి తీసుకెళ్లి అక్కడే హత్య చేశాడు. అనంతరం డెడ్‌బాడీని కారులో తీసుకెళ్లి మంథని సమీపంలోని గాడిదల గండిలో పడేశారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు.
మృతుడి కుటుంబ సభ్యుల ధర్నా
వంశీ హత్య విషయం తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వంశీని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంథని – కాటారం మెయిన్‌రోడ్డుపై బైఠాయించారు. సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రమేశ్... వంశీని హత్య చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పలు కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
