- 5.19 లక్షల మంది నుంచి రూ.1,750 కోట్ల రెగ్యులరైజేషన్ ఫీజు వసూలు
- ఇప్పటివరకు 20 శాతం మందికే ప్లాట్ల రెగ్యులరైజ్
- ఏడాదిగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
- ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి నో క్లియరెన్స్
- తప్పించుకుంటున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) ఫైల్స్ కదలట్లేదు. రెండో విడతలో ఈ స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నిరుడు ఏప్రిల్ 30 నాటికి 5.19 లక్షల మంది నుంచి రూ.1,750 కోట్లు రెగ్యులరైజేషన్ ఫీజు కింద వసూలు చేశారు. ఇందులోనూ ఇప్పటివరకు 20 శాతం మందికి మాత్రమే ఫ్లాట్ల రెగ్యులరైజ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఫీజు కట్టిన లక్షల మంది ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్ల రైగ్యులరైజేషన్ చేయలేకపోతున్నామని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు తప్పించుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పునర్విభజనతో కూడా దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేసి ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు మహానగర కార్పొరేషన్లుగా విభజించింది. కొత్తగా సర్కిళ్లు, డివిజన్లు, వార్డులు ఏర్పాటు చేయడంతో ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించిన ఏ ఫైల్ ఎక్కడుందో తెల్వని పరిస్థితి నెలకొంది.
రూ.1,750 కోట్ల రెగ్యులరైజేషన్ ఫీజు వసూలు
అనధికార లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. తొలి విడతలో కొద్దిపాటి ఫలితాలు మాత్రమే వచ్చాయి. ఈ స్కీమ్‌లో మార్పులు చేసి రెండో విడత 2020 ఆగస్టు 31న 131 జీఓ తీసుకొచ్చారు. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో కొనుగోలు చేసిన ప్లాట్లను మాత్రమే రెగ్యులరైజ్ చేస్తామని జీఓలో పేర్కొన్నారు. డెవలపర్లు, ప్లాట్ యజమానులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. చార్జీల వసూలులో ఆలస్యం వల్ల అప్పుడు స్కీమ్ ఆగిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరి 2025లో జీఓ 28 ద్వారా 25 శాతం రాయితీ కల్పిస్తూ ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ స్కీమ్ తీసుకొచ్చి 18.60 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఫీజు చెల్లింపుల రాయితీ గడువును ముందుగా మార్చి 31గా నిర్ణయించి తర్వాత ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ గడువులోగా రాష్ట్రంలో 5.19 లక్షల మంది అప్లికేషన్ ఫీజు, రెగ్యులరైజేషన్ చార్జీల కింద రూ.1,750 కోట్లు చెల్లించారు.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే ..
ఎల్ఆర్ఎస్ స్కీమ్‌లో డబ్బులు చెల్లించిన 5.19 లక్షల మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 20 శాతం మందికి మాత్రమే రెగ్యులరైజ్ చేసినట్టు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి ప్రొసీడింగ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ల్యాండ్ వ్యాల్యూను బట్టి సర్కారుకు ఫీజు చెల్లించిన వారిలో 80 శాతం మందికి ఇంకా ప్రొసీడింగ్స్ అందలేదు. దీంతో పట్టణాల్లో ఇళ్లు నిర్మించుకోలేక, అవసరానికి ప్లాట్లను ఇతరులకు అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఆఫీసుల చుట్టూ దరఖాస్తుదారులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా అధికారుల నుంచి సమాధానం రావట్లేదు.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంవల్లనే డబ్బులు చెల్లించిన దరఖాస్తుదారులకు రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్లు అందడం లేదు. ఫైల్స్ క్లియర్ చేయడంలో ఆయా శాఖల్లో జాప్యం జరుగుతున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దరఖాస్తులను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఆఫీసులకు పంపిస్తున్నారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రొహిబిటేడ్ ల్యాండ్స్ గురించి పరిశీలించాల్సిన ఆయా శాఖల అధికారులు.. వేగంగా ఫైళ్లను క్లియర్ చేయడం లేదు. ఏ సమస్యలేని ఫైళ్లను కూడా కొందరు ఆఫీసర్లు సర్వే నంబర్ మిస్‌మ్యాచ్, స్పెల్లింగ్మిస్టేక్స్, డాక్యుమెంట్లు లేవన్న కారణాలతో ఆపేస్తున్నారని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ ఫైల్ ఎక్కడుందో తెల్వని పరిస్థితి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వరకు విస్తరించింది. మూడు మహానగర కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించింది. పాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 4.16 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా వీటిలో 1.06 లక్షల మంది ఫీజు చెల్లించారు.
వీరిలో 80 శాతం మంది లబ్ధిదారులకు రెగ్యులరైజేషన్ చేసినట్లు ప్రొసీడింగ్ సర్టిఫికెట్లు జారీకాలేదు. దీంతో వారికి సంబంధించిన ఫైల్స్ ఎక్కడ, ఏ డివిజన్ ఆఫీసులో ఉన్నాయో తెల్వని పరిస్థితి నెలకొంది. డివిజన్ల మార్పుల వల్ల అంతా గందరగోళంగా తయారైందని అప్లిక్యాంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

