ప్రతి ప్లాటుకు ఎల్ఆర్ఎస్.. రూ.15 వేల కోట్ల ఆదాయం

ప్రతి ప్లాటుకు ఎల్ఆర్ఎస్.. రూ.15 వేల కోట్ల ఆదాయం

రెగ్యులరైజ్ కు భారీగా అప్లికేషన్లు వచ్చేలా చూడండి
కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
సగటున ఒక్కో ప్లాట్కు రూ. 60 వేల భారం
ప్రభుత్వానికి రూ. 15వేల కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: రెగ్యులరైజ్ కాని ప్రతి ప్లాట్ను ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) పరిధిలోకి తీసుకురావాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గడువులోగా భారీగా అప్లికేషన్లు తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున ఆదాయం పెంచుకునేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. మొత్తంగా 25 లక్షల ప్లాట్లకు అప్లికేషన్లు రావొచ్చని, ఇప్పటికే 80 శాతం అప్లికేషన్లు వచ్చాయని ఆఫీసర్లు చెప్తున్నారు. స్కీమ్ కింద ప్రభుత్వానికి రూ. 15 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు మొదట ఈ నెల 15 వరకు గడువు ఇచ్చారు. గడువు పెంచాలన్న డిమాండ్ రావడంతో ఈ నెల 31 వరకు పొడిగించారు.

ఒక్కో ప్లాట్కురూ. 60 వేలభారం
ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ కోసం ఒక్కో అప్లికేషన్కు సగటున రూ. 60 వేల ఫీజు భారం పడే చాన్స్ ఉందని ఆఫీసర్లు లెక్కగడుతున్నారు. స్కీమ్
ప్రకారం ప్లాట్ రిజిస్ట్రేషన్ జరిగే నాటికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలో 6 శాతం రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లించాలి. వెంచర్లో ఖాళీ స్థలం లేకపోతే అదనంగా 14 శాతం ఫీజు చెల్లించాలి. దీంతో ఒక్కో దరఖాస్తుదారుడు సగటున రూ. 60 వేలు చెల్లించాల్సి ఉంటుదని ఆఫీసర్లు అంటున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్నిపల్ కార్పొరేషన్లు, కొత్త జిల్లా కేంద్రాల పరిసరాల్లో వెలిసిన వెంచర్ల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందని వారు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయ్యి, రెగ్యులరైజ్ కాని ప్లాట్లు 27 లక్షల వరకు ఉంటాయని, వీటిలో దాదాపు 22 లక్షల ప్లాట్లకు ఇప్పటికే అప్లికేషన్లు
వచ్చాయని పేర్కొంటున్నారు.

ఊళ్ల నుంచే ఎక్కువ అప్లికేషన్లు
ఆన్ లైన్లో వచ్చిన ప్రతి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ను ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫీసర్ల టీం పరిశీలిస్తున్నది. అప్లికేషన్లో ఉన్న వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ
వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ఉన్నాయా? లేదా? అని చెక్ చేస్తున్నది. సరైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేశారో లేదో తనిఖీ చేస్తున్నది. డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న ప్లాట్ల అప్లికేషన్లను పక్కన పెడుతున్నది. గ్రామ పంచాయితీల నుంచే ఎల్ఆర్ఎస్ కోసం ఎక్కువ మొత్తంలో అప్లికేషన్లు వస్తున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. గడువు ముగిసేనాటికి పది లక్షల అప్లికేషన్లు కేవలం గ్రామ పంచాయితీల నుంచే వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత చుట్టుపక్కల ఉన్న ఊళ్లలో పెద్దఎత్తున అక్రమ వెంచర్లు వెలిశాయి. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లను ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రిజిస్ట్రేషన్లతో ఆదాయం వస్తుందన్న ఆశతో ప్రతి ప్లాట్ కు రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అనుమతి లేని వెంచర్లలో ప్లాట్ కొనుగోలుకు ప్రజల నుంచి వేల కోట్లలో ప్రభుత్వం ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైంది.  శుక్రవారం నాటికి పంచాయతీల నుంచి 9,02,765, మున్సిపాలిటీల నుంచి 8,99,026, కార్పొరేషన్ల నుంచి 3,60,225 అప్లికేషన్లు వచ్చాయి.

ఫీజు వసూలుపై డైలామా!
ప్రజల నుంచి రెగ్యులరైజేషన్ ఫీజు రాబట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అప్లికేషన్లు తీసుకుంటున్నప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నందున ఆలోచనలో పడింది. ఎన్నికల ముందు ఫీజు చెల్లించాలని ప్రజలకు నోటీసులు ఇస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దీంతో ఎన్నికల్లో కష్టమేనని టీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎల్ఆర్ఎస్ ఫీజుపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసినప్పుడు మౌనంగా ఉన్న ప్రభుత్వం ప్లాట్ కొనుగోలుదారులపై భారం వేయడం ఏమిటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాలు కూడా ఫీజుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఫీజు తగ్గింపుపై ఆలోచిస్తామని ఇటీవల మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

For More News..

29 మందికి స్త్రీశక్తి అవార్డులు

హైదరాబ్యాడ్ షో.. ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్

జూన్లో కరోనా వ్యాక్సిన్ ఖాయం

ఐటీ రిటర్న్స్ లో కొత్త రూల్స్