కొత్త చీఫ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌గా రాజా సుబ్రమణి

కొత్త చీఫ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌గా రాజా సుబ్రమణి
  • కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 
  • ఈ నెల 30తో ముగియనున్న  ప్రస్తుత సీడీఎస్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌ పదవీకాలం
  • నౌకా దళాధిపతిగా వైస్‌‌‌‌‌‌‌‌ అడ్మిరల్‌‌‌‌‌‌‌‌ కృష్ణ స్వామినాథన్‌‌‌‌‌‌‌‌ 31న బాధ్యతల స్వీకారం


న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగంలో అత్యున్నత పదవి అయిన ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ (సీడీఎస్‌‌‌‌)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం మే 30తో ముగియనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో సుబ్రమణిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జనరల్‌‌‌‌ రాజా సుబ్రమణి ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన జాతీయ భద్రతా మండలి సచివాలయంలో సైనిక సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.1985లో ‘ది గర్వాల్ రైఫిల్స్’లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజా సుబ్రమణి, సుమారు 37 ఏండ్లపాటు భారత సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. దేశంలోని పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో నెలకొన్న భద్రతా సవాళ్లపై ఆయనకు విశేషమైన పట్టు ఉంది. గతంలో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్​గా, సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌‌‌‌గా విశేష సేవలందించారు. 

బ్రిటన్​లో శిక్షణ 

నేషనల్‌‌‌‌ డిఫెన్స్​ అకాడమీ (ఎన్డీఏ), ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లలో శిక్షణ పొందిన సుబ్రమణి.. విదేశీ గడ్డపై కూడా తన ప్రతిభను చాటారు. బ్రిటన్‌‌‌‌లోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందడంతో పాటు లండన్‌‌‌‌లోని కింగ్స్ కాలేజీ నుంచి ఎంఏ డిగ్రీ పొందారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌‌‌‌లో ఎంఫిల్ పూర్తి చేశారు. దేశ రక్షణలో ఆయన చూపిన అసమాన ప్రతిభకుగానూ కేంద్ర ప్రభుత్వం పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్‌‌‌‌లతో ఆయనను గౌరవించింది. ముగ్గురు సర్వీస్ చీఫ్‌‌‌‌లను సమన్వయం చేస్తూ, స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీకి పెద్దపీట వేయడంలాంటి సవాళ్లు ఇప్పుడు కొత్త సీడీఎస్ ముందున్నాయి.