అంచనాలను అందుకోని ఎల్‌ అండ్‌ టీ

అంచనాలను అందుకోని ఎల్‌ అండ్‌ టీ

న్యూఢిల్లీ: ప్రముఖ ఇంజనీరింగ్‌‌ కంపెనీ లార్సన్ అండ్‌‌ టూబ్రో లిమిటెడ్‌‌ ఈ ఏడాది జూన్‌‌తో ముగిసిన మొదటి క్వార్టర్‌‌కుగానూ ప్రకటించిన ఫలితాలు నిరాశపర్చాయి. ఈసారి ఇది రూ.1,560 కోట్ల వరకు లాభం సంపాదిస్తుందన్న విశ్లేషకుల అంచనాలు నిజం కాలేదు. కేవలం రూ.1,472 కోట్లతో సరిపెట్టుకుంది. 2018 తొలి క్వార్టర్‌‌లో లాభాలతో పోలిస్తే ఇది 22 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.31 వేల కోట్లుగా నమోదయింది. తాజా క్వార్టర్‌‌లో ఈబీఐటీడీఏ 20 శాతం పెరిగి రూ.3,319 కోట్లు వచ్చింది. ఈబీఐటీడీఏ మార్జిన్‌‌ 100 బేసిస్‌‌ పాయింట్లకుపైగా పెరిగి 11.2 శాతం నమోదయింది. ఇది ఈసారి 10.9 శాతం వరకు ఉండొచ్చని ఎనలిస్టులు అంచనా వేశారు.

మార్జిన్లు నిలకడగా ఉంటాయని కంపెనీ భావించింది. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ సర్వీసులను మినహాయిస్తే తమ మార్జిన్‌‌ 10.5 శాతం ఉంటుందని తెలిపింది. పార్లమెంటు ఎన్నికల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచే వచ్చే ఆర్డర్లు తగ్గాయని తెలిపింది. జూన్‌‌ క్వార్టర్‌‌లో రూ.38,700 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించామని వెల్లడించింది. ఆర్డర్‌‌బుక్‌‌ బలంగా ఉండటం వల్ల జూన్‌‌ క్వార్టర్‌‌లో వృద్ధి సాధించగలిగామని ప్రకటించింది. నిర్మాణరంగం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశీయ మార్కెట్లో పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఎల్‌‌ అండ్‌‌ టీ పేర్కొంది. పూర్తి మెజారిటీ గల ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఇన్‌‌ఫ్రా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపింది.

మరికొన్ని ముఖ్యాంశాలు:

కంపెనీ ఇతర ఆదాయాలు గత ఏడాది రూ.228 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌లో ఇవి రూ.384 కోట్లకు చేరాయి.

క్యూ1లో రూ38,700 కోట్లు విలువైన ఆర్డర్లు వచ్చాయి. వీటిలో అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ.9,005 కోట్లు ఉంటుంది.

కన్సాలిటేడెట్‌‌ ఆర్డర్‌‌ బుక్‌‌ విలువ ఈ ఏడాది జూన్‌‌ 30 నాటికి రూ.2.94 లక్షల కోట్లకు చేరింది. వీటిలో అంతర్జాతీయ ఆర్డర్ల విలువ 21 శాతం.

సెగ్మెంట్లవారీగా మార్జిన్లను పరిశీలిస్తే ఇన్‌‌ఫ్రా14 శాతం, ఇంజనీరింగ్‌‌ 100 శాతం, డిఫెన్స్‌‌ ఇంజనీరింగ్‌‌ 33 శాతం, హైడ్రోకార్బన్‌‌ ఏడు శాతం, ఐటీ15 శాతం, ఫైనాన్షియల్‌‌ సర్వీసుల 13 శాతం పెరిగింది.

పవర్‌‌ సెక్టర్‌‌ మార్జిన్‌‌ 48 శాతం, డెవెలప్‌‌మెంట్‌‌ ప్రాజెక్టుల 21 శాతం, ఇతర విభాగాల మార్జిన్‌‌ 14 శాతం తగ్గింది.

ఇన్‌‌ఫ్రా విభాగంలో కస్టమర్‌‌ నుంచి వచ్చే ఆదాయం 14 శాతం పెరిగి రూ.13,865 కోట్లకు చేరింది.

హైడ్రో కార్బన్‌‌ సెగ్మెంట్‌‌కురూ.3,424 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి.

ఐటీ కంపెనీ మైండ్‌‌ట్రీలో వాటాలు కొన్నప్పటికి దాని ఆదాయాలను ఈ క్వార్టర్‌‌ ఫలితాల్లో చేర్చలేదని ఎల్‌‌ అండ్‌‌ టీ తెలిపింది.

ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం, టెక్నాలజీల సాయంతో ఖర్చులను తగ్గించుకోవడం, సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్నందున వాటాదారుల ఆదాయం పెరుగుతుందని పేర్కొంది.