- లక్నో వర్సిటీలో విద్యార్థినికి ప్రొఫెసర్ వేధింపులు.. నిందితుడి అరెస్ట్
లక్నో : యూపీలోని లక్నో యూనివర్సిటీలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జువాలజీ విభాగంలో బీఎస్సీ చదువుతున్న విద్యార్థినికి ప్రొఫెసర్ పరమ్‌జిత్ సింగ్ ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు రావడంతో నిందితుడు జైలు పాలయ్యాడు. ఆడియో క్లిప్ లో విద్యార్థినితో ప్రొఫెసర్ పరమ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. " డార్లింగ్.. నీ కోసం రెండు క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి తీసుకొచ్చాను. నన్ను కలవడానికి ఎప్పుడు వస్తావు?" అని అడిగాడు.
దానికి ఆ విద్యార్థిని స్పందిస్తూ.. "సార్.. నేను సిలబస్ అంతా చదివేశాను. ప్రిపరేషన్ పూర్తయింది" అని బదులిచ్చింది. అయితే ప్రొఫెసర్ అంతటితో ఆగకుండా.. " అంటే నువ్వు నన్ను కలవడానికి ఒక్కసారి కూడా రావా?" అని తీవ్ర ఒత్తిడి చేశాడు. దాంతో ఆమె.. " నేను ఇంట్లో పనులు చూసుకోవాలి సార్! రావడానికి ట్రై చేస్తాను" అని చెప్పగా.. చివరకు అతడు "ప్రయత్నించడం కాదు. పరీక్షలకు ముందే... ఈ ఏడు రోజుల్లోగా రావాలి" అంటూ వేధించాడు.
వేధింపులు ఆగకపోవడంతో సదరు విద్యార్థిని వర్సిటీ యంత్రాంగానికి ఫిర్యాదు చేసింది. ఫోన్ ఆడియో క్లిప్‌లను అధికారులకు అందజేసింది. దీనిపై లక్నో యూనివర్సిటీ అధికారులు పరమ్‌జిత్ సింగ్ పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
