సమ్మర్‌‌‌‌ సీజన్‌‌లో లగ్జరీ హోటల్స్ దూకుడు.. ఇరాన్ యుద్ధంతో ఇండియాలోనే సంపన్నల హాలిడేస్

సమ్మర్‌‌‌‌ సీజన్‌‌లో లగ్జరీ హోటల్స్ దూకుడు.. ఇరాన్ యుద్ధంతో ఇండియాలోనే సంపన్నల హాలిడేస్
  • ఐటీసీ, రాడిసన్‌‌‌‌, లీలా ప్యాలెసెస్ వంటి హోటల్స్‌‌‌‌ ఆక్యుపెన్సీ అప్
  •     చిన్న హోటల్స్‌‌‌‌, రిసోర్ట్‌‌‌‌లకు కూడా డిమాండ్‌‌‌‌ 
  •     హిల్ స్టేషన్స్,  ఆధ్యాత్మిక కేంద్రాలకు క్యూ కడుతున్న జనం

న్యూఢిల్లీ: ఐటీసీ, రాడిసన్, ది లీలా ప్యాలెసెస్ వంటి లగ్జరీ హోటల్స్ ఫుల్ ఖుషీగా ఉన్నాయి. ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల సంపన్న భారతీయుల విదేశీ ప్రయాణాలు భారీగా పడిపోయాయి. బదులుగా వీరు ఇండియాలో ట్రావెల్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.  దీంతో  దేశీయంగా ఐటీసీ హోటల్స్, రాడిసన్ హోటల్ గ్రూప్ వంటి  లగ్జరీ హాస్పిటాలిటీ సంస్థల రూమ్‌‌లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. 

విదేశీ ప్రయాణాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణానికి వీలుకాకపోవడం,  టికెట్ల ధరలు విపరీతంగా పెరగడం, విమాన సర్వీసులలో అంతరాయాలు లేదా దేశీయంగానే లగ్జరీ సేవలు అందుబాటులోకి రావడం వల్ల చాలామంది భారతీయులు ఈ సమ్మర్ హాలిడేస్‌‌ను ఇండియాలోనే గడపడానికి ఇష్టపడుతున్నారు.

బుకింగ్స్ ట్రెండ్స్ ఇలా..

1. ది లీలా ప్యాలెసెస్, హోటల్స్ అండ్ రిసార్ట్స్ 

‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత, అధిక ప్రయాణ ఖర్చులు సంపన్న వినియోగదారులను దేశీయంగా ఉన్న ప్రీమియం ప్రత్యామ్నాయాల  వైపు మళ్లేలా చేశాయి. ఈ వేసవిలో లగ్జరీ రిసార్టులు, హెరిటేజ్ ప్రదేశాలు, వెల్‌‌నెస్ రిట్రీట్స్‌‌కు డిమాండ్ బాగుంది” అని  లీలా ప్యాలెసెస్‌ హోటల్ సీఈఓ అనురాగ్ భట్నాగర్  తెలిపారు. 

2. ఐటీసీ హోటల్స్

ఐటీసీ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ చధా మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేసవి బుకింగ్స్ పెరిగాయని, పలు పర్యాటక ప్రాంతాలలో గతేడాది కంటే ఎక్కువ డిమాండ్ నమోదవుతోందని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల వల్లే ఇన్వెస్టర్లు, పర్యాటకులు తమ ప్లాన్లను మార్చుకుని ఇండియా వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.

3. రాడిసన్ హోటల్ గ్రూప్

ఈ వేసవిలో రాడిసన్ ఇండియా పోర్ట్‌‌ఫోలియోలో మొత్తం ఆక్యుపెన్సీ స్థాయిలు గత ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరిగాయని ఈ సంస్థ దక్షిణాసియా ఎండీ,  సీఓఓ నిఖిల్ శర్మ తెలిపారు. ముఖ్యంగా లీజర్ డెస్టినేషన్లలో సగటు ఆక్యుపెన్సీ దాదాపు 75 శాతానికి చేరగా, వారాంతాల్లో (వీకెండ్స్) ఈ డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటోందన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ టూర్లు పడిపోవడంతో, ఆ డిమాండ్ దేశీయ మార్కెట్ వైపు మళ్లిందని ఆయన వివరించారు.

చిన్న హోటల్స్‌‌కు డిమాండ్

కేవలం పెద్ద హోటల్ చైన్స్ మాత్రమే కాకుండా ఇండిపెండెంట్‌‌ లగ్జరీ రిసార్టులు కూడా ఈసారి డిమాండ్ బాగుందని చెబుతున్నాయి.  'ఆహానా రిసార్ట్ అండ్ స్పా' సీఎంఓ అవ్ని త్రిపాఠి మాట్లాడుతూ.. సాధారణ హాలిడేస్ కంటే  వైల్డ్‌‌లైఫ్‌‌, వెల్‌‌నెస్, లగ్జరీ ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని స్పష్టం చేశారు. ఆగ్రాలోని 'జేపీ ప్యాలెస్ హోటల్' జనరల్ మేనేజర్ హరి సుకుమార్ మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే తమ పోర్ట్‌‌ఫోలియోలో ఆక్యుపెన్సీ 8 శాతం పెరిగిందని, సంపన్నలు ఇప్పుడు ఇండియాను  ఒక పూర్తిస్థాయి లగ్జరీ డెస్టినేషన్‌‌గా గుర్తిస్తున్నారని అన్నారు.

ఆలోచనల్లో మార్పు..

కేవలం చుట్టుపక్కల ప్రదేశాలను చూసి వచ్చేయడం కాకుండా.. స్థానిక సంస్కృతి, వెల్‌‌నెస్, అడవులు/ప్రకృతి, స్థానిక ఆహార విశేషాలను అనుభవించే 'ఎక్స్‌‌పీరియన్షియల్ టూరిజం' వైపు పర్యాటకులు మళ్లుతున్నారు. హెరిటేజ్ స్టేస్, ఫారెస్ట్ రిట్రీట్స్, డెస్టినేషన్ స్టోరీ టెల్లింగ్‌‌పై ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారని ఐటీసీ ఎండీ అనిల్ చధా తెలిపారు. అలాగే, సాంప్రదాయ పర్యాటక కేంద్రాలే కాకుండా టైర్-2, టైర్-3 నగరాల వైపు కూడా పర్యాటకులు అడుగులు వేస్తున్నారని అన్నారు. తక్కువ రద్దీ ఉండే పాపులర్‌‌‌‌ ప్రదేశాల కోసం వెతుకుతూ ప్రయాగ్‌‌రాజ్, కత్రా, అమృత్‌‌సర్, భువనేశ్వర్ వంటి నగరాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యటనలు చేస్తున్నారన్నారు.

వీటికి మొగ్గు..

వేడి నుంచి ఉపశమనం కలిగించే హిల్ స్టేషన్లు,  సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలకు ఈసారి అత్యధిక ఆదరణ లభిస్తోందని రాడిసన్ తెలిపింది.  గత ఏడాదితో పోలిస్తే ఈసారి హిల్ స్టేషన్ ప్రాపర్టీలలో ఏకంగా 69 శాతం వృద్ధి నమోదైందని,  ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో 41 శాతం వృద్ధి కనిపించిందని వివరించింది. జమ్మూ అండ్‌‌ కాశ్మీర్, మనాలి, ముస్సోరీ, ఉదయ్‌‌పూర్, అయోధ్యలకు ఈ సమ్మర్‌‌‌‌లో ఎక్కువ డిమాండ్ కనిపించింది.  గోవా వంటి బీచ్ ప్రాంతాలు, దక్షిణ భారతదేశ తీరప్రాంత రిసార్టులకు కూడా మంచి డిమాండ్ ఉంది.