- ప్రతిపక్షంగా ప్రజాహక్కుల కోసం పోరాడతామని వెల్లడి
చెన్నై: గెలుపు ఓటములు తమకు కొత్తేం కాదని తమిళనాడు మాజీ సీఎం, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) చీఫ్ స్టాలిన్ అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తొలిసారి మంగళవారం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తమ పార్టీ ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చిందని, ఓటములూ ఎదుర్కొందని పేర్కొన్నారు. ‘‘మేము చూడని విజయాలు లేవు, ఎదుర్కోని ఓటమి లేదు. డీఎంకే ఆరుసార్లు అధికారంలోకి వచ్చింది.
గెలుపు ఓటములు కొత్తవి కాదు. కానీ, మా సిద్ధాంతం మాత్రం ఓడిపోకూడదు’’ అని పేర్కొన్నారు. గెలుపు, ఓటమిని సమానంగా తీసుకుని తమ సిద్ధాంతాల కోసం ముందుకు సాగడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. టీవీకేతో పోలిస్తే తాము అతికొద్ది ఓట్లను కోల్పోయామని పేర్కొన్నారు. తమ కూటమికి 1.54 కోట్ల ఓట్లు పడ్డాయని, టీవీకే కేవలం 17.43 లక్షల ఓట్లు ఆధిక్యం సాధించిందని వెల్లడించారు. ఓట్లలో తేడా 3.52శాతమేనని అన్నారు.
డీఎంకేపై ప్రజల్లో నమ్మకం బలంగా ఉందని, ప్రతి ఓటును ఆ నమ్మకానికి చిహ్నంగా భావిస్తున్నామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. బలమైన ప్రతిపక్షంగా ఉంటూ తిరిగి అధికారంలోకి వస్తామని స్టాలిన్ దీమా వ్యక్తం చేశారు. కాగా, 1989 నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్టాలిన్.. 2021లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 35 ఏండ్ల రాజకీయ జీవితంలో ఓడిపోవడం ఇదే తొలిసారి.
