- సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు
- నగదు చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లయ్ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం జగిత్యాల జిల్లాతోపాటు పలు జిల్లాల్లో ఆయన పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను తనిఖీ చేశారు. సెంటర్లలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యం చేయకూడదని, తూకం పూర్తయిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు.
అనంతరం రైస్ మిల్లులను సందర్శించిన కమిషనర్ ధాన్యం రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియపై అధికారులు, మిల్లుల యజమానులతో సమీక్ష నిర్వహించారు. మిల్లుల వద్ద లారీల నుంచి ధాన్యాన్ని వెంటవెంటనే అన్‌లోడ్ చేసేందుకు తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని మిల్లర్లకు చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల టన్నుల ధాన్యం సేరించామని, రైతుల ఖాతాల్లో రూ.2,506 కోట్లు జమ చేశామని తెలిపారు.
