జో శర్మ ప్రధాన పాత్రలో మోహన్ వడ్లపట్ల దర్శకనిర్మాతగా తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎమ్ 4 ఎమ్’. మే 8న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ ‘అమెరికాలో నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని. అక్కడ నాకంటూ ఒక థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ చిత్రానికి మోహన్ గారు, రాహుల్ అడవల గారితో కలిసి కో-రైటర్‌గా కూడా పనిచేశా.
ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. నేను రాధ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తా. ఇందులో ఓ సీరియల్ కిల్లర్ హత్యలు చేసి, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో పెయింటింగ్స్ తరహాలో డెకరేట్ చేస్తాడు. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా రాలేదు. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. ఏసీపీ కృష్ణ పాత్ర హీరోగా ఉంటుంది. విడుదల రోజు ఈ సినిమాలో విలన్ ఎవరో చెబితే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించాం.
ఇప్పటికే ఈ సినిమాకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మక 'కేన్స్' ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా సినిమా గ్లోబల్ ప్రీమియర్ వేయడం, విదేశీయులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం సినిమాపై మా నమ్మకాన్ని పెంచింది. కచ్చితంగా ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక ఓ నటిగా బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకోవడమే నా లక్ష్యం” అని చెప్పారు.
