హైదరాబాద్ అమీన్ పూర్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు 2.7 కిలోల ఓపియం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో శుక్రవారం ( ఫిబ్రవరి 20 ) అమీన్ పూర్ లోని ఓ మార్బుల్ షాపులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి డ్రగ్స్ తో పాటు రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులు రాజస్థాన్ కు చెందినవారని.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను స్థానిక అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు ఎస్ఓటీ పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అమీన్ పూర్ పోలీసులు.
ఇదిలా ఉండగా.. గంజాయి, డ్రగ్స్ కోసం మత్తు బానిసలు కొత్త తరహా దందాకు తెరతీశారు. జట్లుగా ఏర్పడి గంజాయి కొనుగోలు చేస్తున్నారు. తాము వినియోగించడంతో పాటు గంజాయిని అమ్మి, సొమ్ము చేసుకుంటున్నారు. చైన్ సిస్టమ్లో సాగుతున్న గంజాయి సప్లయ్స్ డ్రగ్స్ కూడా పెత్త మొత్తంలో చేతులు మారుతోంది. మాదకద్రవ్యాలను కట్టడి చేయడంతో భాగంగా రాష్ట్ర ఈగల్ (ఎలైట్ యాకన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) ఫోర్స్ చేస్తున్న డెకాయ్ ఆపరేషన్స్ లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇంజనీరింగ్ విద్యార్థులు సహా చెడు అలవాట్లకు బానిసలైన యువత క్రౌండ్ ఫండింగ్, డెడ్ డ్రాప్ విధానంలో గంజాయి, డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు ఈగల్ గుర్తించింది. ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి, గోవా నుంచి సింథటిక్ డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో బయటపడింది.
