
- కేసీఆర్ పై మధు యాష్కీ సెటైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోనే బీఆర్ఎస్ కు దిక్కు లేదని, అలాంటిది ఇతర రాష్ట్రాల్లో పార్టీని ఎలా నిడుపుతారని కేసీఆర్ ను పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఓటమితో ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అనడంపై మధు యాష్కీ శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. అధికారంలో ఉన్న పదేండ్లలో ప్రజలను కేసీఆర్ ఎప్పుడూ పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఇప్పుడు అధికారం పోగానే బీఆర్ఎస్ ఓటమి గురించి ప్రజలు బాధపడుతున్నారని అనడం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి మాటలు కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని, ఆయన మానసిక స్థితిని తెలియజేస్తుందన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా మాయమాటలతో ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టాలని చూస్తున్నారని యాష్కీ ధ్వజమెత్తారు.