- ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పటిష్టతకు సహకారం అందిస్తానన్న సీఎం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితో ప్రొఫెషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మధు యాష్కీ సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో భేటీ అయ్యారు. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు స్వీకరించిన మధు యాష్కీని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని సీఎం రేవంత్ ఆయనకు హామీ ఇచ్చారు.
సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. వివిధ రంగాల్లోని నిపుణులను ప్రొఫెషనల్ కాంగ్రెస్ వేదికగా ఒకే తాటిపైకి తీసుకురావచ్చని, దీని ద్వారా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమగ్ర నివేదికలు రూపొందించే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
