కేటీఆర్​ ఆస్తులు 424 % ఎట్ల పెరిగినయ్? : మధు యాష్కీ

కేటీఆర్​ ఆస్తులు 424 %  ఎట్ల పెరిగినయ్? : మధు యాష్కీ

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ ఆస్తులు తొమ్మిదేండ్లలోనే 424 శాతం పెరిగాయని, అదెట్ల సాధ్యమైందని పీసీసీ ప్రచా ర కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ప్రశ్నించారు. శ్రీకాంతా చారి వంటి వాళ్ల బలిదానాలతో రాష్ట్రం వస్తే.. డైరెక్ట్​గా మంత్రి అయిన కేటీఆర్ కంపెనీలను స్థాపించి సంపదను పెంచుకున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఆస్తులు పెరిగాయే తప్ప.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాల ఆదాయం మాత్రం పెరగలేదన్నారు. చాలా తక్కువ టైంలోనే కేసీఆర్, హరీశ్​రావు, కవిత, కేటీఆర్, సంతోష్​రావుల ఆస్తులే వేలకోట్లకు పెరిగాయన్నారు. దుబాయ్ శేఖర్​గా గుర్తింపు పొందిన కేసీఆర్.. ఓ చిన్న ఇంట్లో ఉండేవారని అన్నారు. 

కానీ, ఇప్పుడు కేటీఆర్ ప్రైవేటు విమానంలో అమెరికా టూర్​కు వెళ్తున్నారని చెప్పారు. అదంతా ఎవరి సొమ్ము, ఏ కంపెనీ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుడు బడ్జెట్​లో దళితబంధు కోసం రూ.17,700 కోట్లు కేటాయించి.. ఎంతమందికి ఇచ్చారో కేటీఆర్ ​చెప్పాలన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్ భాయీ భాయీ అని అన్నారు. కవిత లిక్కర్​ కేసుకు సంబంధించి చార్జిషీట్​లో కవిత పేరున్నా అరెస్ట్​ చేయలేదని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చేందుకు కేసీఆర్​ కోట్లు కుమ్మరించారన్న ఆరోపణలు వస్తున్నాయని విమర్శించారు.

రాహుల్​పై కక్షసాధింపు ఆపాలె: కాంగ్రెస్​

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిటిషన్​ను గుజరాత్ హైకో ర్టు కొట్టేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మోదీ దిష్టి బొమ్మలను తగులబెట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్​ తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.