- మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి డిమాండ్
బషీర్బాగ్, వెలుగు:బషీర్బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో కులగణన చేపట్టడంతో పాటు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
ప్రధాని మోదీ హయాంలో బీసీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని, వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని విమర్శించారు. అనంతరం ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని, హౌస్ హోల్డ్ సర్వేలో ఓబీసీ గణనను చేర్చాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో మే 9న ఇందిరాపార్కు వద్ద భారీ నిరసన దీక్షలు చేపడతామని, ఈనెల 2న బీసీ సంఘాలతో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నేతలు గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

