బిడ్డ శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి 

బిడ్డ శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి 
  • బిడ్డ శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి 
  • మధ్యప్రదేశ్​లో అంబులెన్స్ ఇవ్వని సర్కారు ఆస్పత్రి 

భోపాల్:  మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. గవర్నమెంట్ ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో బిడ్డ శవాన్ని తండ్రి భుజాలపై 5 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఈ వీడియో శుక్రవారం వైరల్ అయింది. ఛతర్​పూర్ జిల్లాకు చెందిన నాలుగేండ్ల బాలికకు ఆరోగ్యం బాలేక కుటుంబ సభ్యులు దగ్గర్లోని హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఛతర్ పూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడామె ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని అడిగితే ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేయలేదు. 

ప్రైవేట్ వెహికల్ లో తీసుకెళ్లే స్తోమత లేక కుటుంబ సభ్యులు బాలిక డెడ్ బాడీని బ్లాంకెట్ లో చుట్టి బస్సులో వాళ్ల ఊరుకు దగ్గర్లోని బుక్స్వాహ టౌన్ కు వచ్చారు. అక్కడ నగర పంచాయతీ పెద్దలను వాహనం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ఎవరూ స్పందించలేదు. దీంతో బాలిక తండ్రి ఆమె శవాన్ని 5 కిలోమీటర్ల దూరంలోని తమ ఊరికి మోసుకెళ్లారు. 

మరో ఘటనలో మంచంలో.. 

మధ్యప్రదేశ్ లో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. సాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఆరోగ్యం బాలేక కుటుంబ సభ్యులు దగ్గర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని కుటుంబ సభ్యులు అడిగితే ఆస్పత్రి సిబ్బంది ఇవ్వలేదు. ప్రైవేట్ వెహికల్ లో తీసుకెళ్లే స్తోమత లేక, మంచంలో డెడ్ బాడీని మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఇంకో ఘటనలో అంబులెన్స్ రాక గర్భిణి మృతి చెందింది. ఖార్గోన్ జిల్లాకు చెందిన గర్భిణికి నొప్పులు మొదలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కానీ ఎన్నిసార్లు చేసినా వాళ్లు రాలేదు. దీంతో కుటుంబసభ్యులే మంచంపై గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మధ్యలోనే ఆమె చనిపోయింది.