పళనిస్వామికి అనూకూలంగా తీర్పు

పళనిస్వామికి అనూకూలంగా తీర్పు

మద్రాసు హైకోర్టు పన్నీరు సెల్వంకు షాకిచ్చింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టిన డివిజన్ బెంచ్ ..మాజీ సీఎం పళనిస్వామికి అనుకూలంగా  తీర్పునిచ్చింది. జులై 11న జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్‌ చెల్లుతుందని స్పష్టం చేసింది. AIDMK తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నిక సరైందేనని పేర్కొంది. జులై 11న జరిగిన AIDMK జనరల్ కౌన్సిల్ సమావేశంపై మాజీ సీఎం పన్నీరు సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో సమావేశం చెల్లదంటూ సింగిల్ జడ్చి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై  పళనిస్వామి కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ఎం దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసి పుచ్చింది. తాజా తీర్పుతో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు పళనిస్వామికే దక్కనున్నాయి. 

సుప్రీంకోర్టుకు పన్నీరు సెల్వం..
మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం అన్నారు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ కేసుపై ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయబోతున్నట్లు వెల్లడించారు. 

సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే...?
జులై 11న అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్‌ పై మాజీ సీఎం పన్నీరు సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అన్యాయంగా తనను పార్టీ నుంచి బహిష్కరించటమే కాకుండా..అన్నాడీఎంకే నిబంధనలకు విరుద్ధంగా జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించటాన్ని పన్నీరు సెల్వం హైకోర్ట్‌లో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు..అన్నా డీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం చెల్లదని ఆగస్టు 17న తీర్పు చెప్పింది. మరోసారి సమావేశం నిర్వహించాలని తేల్చి చెప్పింది. కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్‌కు మాత్రమే జనరల్ కౌన్సిల్ నిర్వహించే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. 

జయలలిత మరణం తర్వాత వివాదాలు..
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో వివాదాలు ముదిరాయి. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియ‌ర్ నేత‌లు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు తీవ్రంగా ప్రయత్నించాయి. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలలో ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవాలని నిర్ణయించడంతో ఎక్కువ మంది పళనిస్వామి వైపే మొగ్గు చూపారు. దీంతో  ఓ సమావేశం మధ్యలోనే పన్నీర్ సెల్వం తన మద్దతు దారులతో వాకౌట్ చేశారు. అయితే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపు నీళ్ల సీసాలు విసిరారు. బయట పన్నీర్ సెల్వం కారు టైర్లో గాలి కూడా తీసేశారు. ఈ గందరగోళం తరవాతే...జులై 11న మరోసారి మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో...పన్నీర్‌సెల్వంని పార్టీ సభ్యత్వం నుంచి తొలగించటంతో పాటు, ట్రెజరర్‌ పోస్ట్ నుంచి కూడా తప్పిస్తున్నట్టు తీర్మానం పాస్ చేశారు. ఆయన స్థానంలో పళనిస్వామి AIDMK తాత్కాలిక జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. ఈ నిర్ణయం తరవాత పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి.