ట్యాంక్ బండ్, వెలుగు: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విద్వేష ప్రసంగాలు – విద్వేష నేరాల(నివారణ) చట్టం–2026పై నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ సభ్యులు, ఎమ్మెల్యేలకు నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ ప్రతినిధులు సి.ఎ.డేనియల్ అడమ్స్, జెరూసలెం మత్తయ్య, దళిత క్రిస్టియన్ స్టూడెంట్స్ అండ్ అడ్వకేట్స్ ఫ్రంట్ అధ్యక్షుడు గడ్డం అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చట్టాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో వచ్చిన సూచనల నేపథ్యంలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. మహిళలు, వ్యక్తుల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను అరికట్టడం అవసరమని పేర్కొన్నారు. టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న మతపరమైన వాదోపవాదాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
