కేఎల్ వర్సిటీ విద్యార్థులకు రికార్డు స్థాయి ప్లేస్‌మెంట్స్

కేఎల్ వర్సిటీ విద్యార్థులకు రికార్డు స్థాయి ప్లేస్‌మెంట్స్
  •     ఈ అకడమిక్ ఇయర్‌‌లో  6,300 మందికి ఆఫర్స్

హైదరాబాద్, వెలుగు: క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కేఎల్ (డీమ్డ్ టు బీ) యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. అంతర్జాతీయ కంపెనీ నెక్స్‌పర్ట్ నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌లో ఒక విద్యార్థి ఏకంగా రూ.81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించి రికార్డు సృష్టించారు. ఈ వివరాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పార్థసారధి వర్మ గురువారం వెల్లడించారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో  రూ.52 లక్షలు, రూ.44 లక్షలు, రూ.40 లక్షలు, రూ.34 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీలను స్టూడెంట్లు సాధించినట్టు తెలిపారు. 

అలాగే 150 మంది విద్యార్థులు రూ.25 లక్షలు, 630 మంది విద్యార్థులు రూ.15 లక్షల వార్షిక ప్యాకేజీలను దక్కించుకున్నారని చెప్పారు. గూగుల్, హితాచీ,  తోషిబా, అమెజాన్, సర్వీస్ నౌ, జేపీ మోర్గాన్ వంటి 342 కంపెనీలు ఈ ఏడాది యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ నిర్వహించాయని.. వీటి ద్వారా 6,300కుపైగా ప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ పొందారని, 4 ,750 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ సాధించారని పేర్కొన్నారు. గత 16 ఏండ్లుగా అర్హత కలిగిన విద్యార్థులందరికీ 100 శాతం ప్లేస్‌మెంట్స్ అందించడం యూనివర్సిటీకి గర్వకారణమని వెల్లడించారు.