బెంగళూరులో ఘోరం జరిగింది. భార్య ఎక్కువగా ఎవరితోనో కాల్ మాట్లాడుతుందని, ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఆమెను చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. భార్యాభర్తను బీహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహ్మద్ ఇర్ఫాజ్ (22), రుక్సానా (25) ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. రుక్సానాకు అప్పటికే పెళ్లై ఒక బాబు ఉన్నాడు. విభేదాల కారణంగా మొదటి భర్తతో ఆమె దూరంగా ఉంటోంది.
బీహార్‌లో బెలూన్లు అమ్ముకుంటున్న క్రమంలో ఇర్ఫాజ్, రుక్సానాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆరు నెలల క్రితం ఇద్దరూ బెంగళూరుకు వచ్చారు. పెళ్లి చేసుకున్నారు. ఇర్ఫాజ్ బెంగళూరులోని లోకల్ గార్మెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాడు. రుక్సానా తరచుగా కాల్స్ మాట్లాడుతుండటంతో ఆమెపై ఇర్ఫాజ్ అనుమానం పెంచుకున్నాడు. తనకు తెలియకుండా ఎవరితోనో కాల్స్ మాట్లాడుతుందని, ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఇర్ఫాజ్ అనుమానించాడు.
అక్టోబర్ 10న ఈ విషయంలో భార్యాభర్త మధ్య గొడవ జరిగింది. రుక్సానాపై ఇర్ఫాజ్ రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలు కావడంతో ఆమె చనిపోయింది. ఆమెను చంపేసి నోట్లో గుడ్డ ముక్క కుక్కేశాడు. ఆమె మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి గోపాలపుర డ్రైనేజీ దగ్గరకు తీసుకెళ్లి మురికి కాలువలో రుక్సానా డెడ్ బాడీని పడేశాడు. అక్టోబర్ 13న రుక్సానా డెడ్ బాడీని పోలీసులు మురికి కాలువలో గుర్తించారు. ఇర్ఫాజ్ భార్య కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇర్ఫాజ్ను పోలీసులు ప్రశ్నించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో నిందితుడు నిజం అంగీకరించాడు. పోలీసులు ఇర్ఫాజ్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
