ఐపీఎల్ మ్యాచ్ లకు భారీ భద్రత.. 2 వేల మంది పోలీసులు రెడీ.. 430 సీసీ కెమెరాల ఏర్పాటు: డీసీపీ సురేశ్కుమార్

ఐపీఎల్ మ్యాచ్ లకు భారీ భద్రత.. 2 వేల మంది పోలీసులు రెడీ.. 430 సీసీ కెమెరాల ఏర్పాటు: డీసీపీ సురేశ్కుమార్
  • ట్రాఫిక్​ మళ్లింపులు, ఆంక్షలు ఉంటయ్​

ఉప్పల్/మల్కాజిగిరి, వెలుగు : రాజీవ్​ గాంధీ ఇంటర్​ నేషనల్​క్రికెట్​స్టేడియంలో నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌ల  కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 5 నుంచి  మే 22 వరకు డే అండ్​ నైట్ మ్యాచ్‌‌‌‌లు జరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్​డీసీపీ కె. సురేష్​ కుమార్​గురువారం స్టేడియంలో ప్రెస్ ​మీట్​నిర్వహించి మాట్లాడారు. భద్రత కోసం సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సెక్యూరిటీ విభాగాలతో పాటు టీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌పీ, ఏఆర్ దళాలు, మౌంటెడ్ పోలీస్, బాంబ్ డిస్పోజల్, ఇంటెలిజెన్స్, స్పెషల్​ ఆపరేషన్ టీంలను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. 

అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు అంబులెన్స్‌‌‌‌, ఫైర్​ టీంలను రెడీగా ఉంచుతున్నట్లు తెలిపారు. స్టేడియం చుట్టుపక్కల  430 సీసీ టీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటుతో పాటు అన్ని ఫుటేజీలను పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు  చేస్తున్నామన్నారు. మ్యాచ్‌‌‌‌లు ముగిసే వరకు నిరంతర తనిఖీలు ఉంటాయన్నారు. ఆడియన్స్​కు టికెట్‌‌‌‌లో కేటాయించిన గేట్ల నుంచి మాత్రమే ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. 

గేట్ నంబర్-1 నుంచి కేవలం ప్లేయర్స్​కు మాత్రమే ఎంట్రీ ఉంటుందన్నారు. స్టేడియంలోకి నిషేధిత వస్తువులపై కఠిన ఆంక్షలు విధించామని డీసీపీ స్పష్టం చేశారు. స్కానర్ల ద్వారా తనిఖీలు నిర్వహించడంతో పాటు స్నిఫర్ డాగ్‌‌‌‌లు, బాంబ్ డిస్పోజల్ టీంలను రంగంలోకి దింపుతున్నామన్నారు. ఈవ్‌‌‌‌టీజింగ్ పై నిఘాకు షీ టీంలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. బ్లాక్ టికెట్ల దందా అరికట్టేందుకు స్పెషల్​ టీమ్స్​ను దింపుతున్నట్లు వెల్లడించారు. 

ట్రాఫిక్ కంట్రోల్​ కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆడియన్స్​వెహికిల్​పార్కింగ్‌‌‌‌ను నిర్దేశిత ప్రాంతాల్లోనే అనుమతిస్తామన్నారు. ప్రేక్షకులు వీలైనంతవరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు సేవలను వినియోగించాలని సూచించారు. ఈ సమావేశంలో హెచ్​సీఏ ప్రతినిధులు, ఉప్పల్​ ఏసీపీ తదితరులు పాల్గొన్నారు. 

ఇవి తేవొద్దు 

ప్రేక్షకులు ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, బ్యాగులు, కెమెరాలు, వాటర్ బాటిళ్లు, బయటి ఆహారం, సిగరెట్లు, లైటర్లు, హెల్మెట్లు, పదునైన వస్తువులు, పెర్ఫ్యూమ్స్, లేజర్ పాయింటర్లు వంటి వస్తువులను స్టేడియంలోకి తీసుకురావడాన్ని  నిషేధించారు. స్టేడియంలో క్లోక్ రూమ్ సౌకర్యం లేదని గమనించాలన్నారు. 

పార్కింగ్ ఎక్కడంటే ..

హబ్సిగూడ వైపు పెంగ్విన్ గ్రౌండ్స్, టీజీఐఏఎల్‌‌‌‌ఏ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు. రామంతాపూర్ వైపు డీఎస్ఎల్ ఓపెన్ ప్లేస్, మోడరన్ బేకరీ వద్ద వాహనాలు నిలిపే అవకాశం ఉంది. స్టేడియం లోపల పార్కింగ్ కేవలం వీఐపీ, వీవీఐపీ వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు.  

అత్యవసర సేవలు సిద్ధం

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐదు అంబులెన్సులు, నాలుగు ఫైరింజన్లను స్టేడియం వద్ద సిద్ధంగా ఉంచనున్నారు.  
ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు మ్యాచ్‌‌‌‌లు జరిగే రోజుల్లో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నాగోల్–-హబ్సిగూడ, బోడుప్పల్-అంబర్‌‌‌‌పేట్ మార్గాల్లో వాహనాల రాకపోకలు మందగించే అవకాశం ఉంటుందన్నారు. భారీ వాహనాలకు ఉప్పల్ వైపు ప్రవేశాన్ని నిలిపివేశామన్నారు. 

ఘటకేసర్ నుంచి వచ్చే వాహనాలను నాగోల్-, ఎల్బీ నగర్ వైపు, ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద మళ్లిస్తామన్నారు. తార్నాక, హబ్సిగూడ, రామంతాపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నాచారం, చెర్లపల్లి వైపు పంపిస్తారు. వరంగల్ వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ రూట్​వినియోగించాలన్నారు.