కాళేశ్వరానికి జాతీయ హోదా ఏదీ? : వద్దిరాజు రవిచంద్ర

కాళేశ్వరానికి జాతీయ హోదా ఏదీ? : వద్దిరాజు రవిచంద్ర
  •     రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన వద్దిరాజు రవిచంద్ర

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఎగువసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, విభజన హామీల పెండింగ్ అంశాలను సభ దృష్టికి తెచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఏ ప్రభుత్వమైనా ప్రజల పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పనులు చేపడుతుందని, ఎవరూ తమ ఇంటి నుంచి డబ్బులు తీసుకురారని రవిచంద్ర స్పష్టం చేశారు. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.60 వేల కోట్లు అప్పుగా తీసుకునే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామమని తెలిపారు. కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులలో కనీసం ఒకదానికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై కేంద్ర మంత్రులు సీఆర్. పాటిల్, కిషన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌‌‌‌ను అభ్యర్థించారు. 

రాజకీయ విమర్శల కోసం వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు. విభజన సమయంలో ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని రవిచంద్ర కోరారు. ముఖ్యంగా భద్రాద్రి రామయ్యకు చెందిన విలువైన భూములు, ఆస్తులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయని, దీనివల్ల ఆలయ ఆర్థిక లావాదేవీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణకు ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం మొండిచేయి చూపుతున్నదని ఆయన విమర్శించారు. 

విభజన చట్టంలోని బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీని ఇప్పటికీ విస్మరించారని మండిపడ్డారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులు కేవలం మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. యూనివర్సిటీ పనులు అత్యంత నెమ్మదిగా సాగుతున్నాయని, ఇదే తీరు కొనసాగితే మరో పదేండ్లయినా అది అందుబాటులోకి రాదని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్, ఆదిలాబాద్, రామగుండం విమానాశ్రయాల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.