- 2025-26లో అత్యుత్తమ ఫలితాలు నమోదు
- దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే జోన్2025–26 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.13,575 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నట్టు దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్శ్రీవాస్తవ వెల్లడించారు. ఇంతకుముందు అత్యుత్తమ రికార్డుగా, 2024-–25 ఆర్థిక సంవత్సరంలో రూ.13,535 కోట్లు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జోన్అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసిందన్నారు.
గురువారం సికింద్రాబాద్ రైల్నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సరుకు రవాణా ఈ ఆర్థిక సంవత్సరంలో 147.871 మిలియన్ టన్నులు చేసి జోన్ చరిత్రలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించినట్టు వివరించారు. రైలు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ .6235.37 కోట్ల ఆదాయం నమోదు చేసినట్టు తెలిపారు.
2024–-25 సంవత్సరంలో 263.36 మిలియన్లతో పోలిస్తే, 2025–-26 సంవత్సరంలో జోన్ 286.44 మిలియన్ల ప్రయాణికులను అధికంగా రవాణా చేసిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 194.57 కిలోమీటర్ల ట్రాక్ అదనంగా చేరిందని, ఇందులో 35.93 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, 78.768 కిలోమీటర్ల మేర డబ్లింగ్, 79.872 కిలో మీటర్ల మేర ట్రిప్లింగ్ నిర్మాణ పనులు చేసినట్టు తెలిపారు. జోన్ పరిధిలో 2025-–26లో 72 రోడ్డు అండర్ బ్రిడ్జిలు, 27 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు నిర్మించినట్టు పేర్కొన్నారు. స్క్రాప్అమ్మకాల ద్వారా కూడా రికార్డు స్థాయిలో 650.30 కోట్లు ఆదాయం సమకూరినట్టు వెల్లడించారు.
