- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్న కేంద్రం
- తెలంగాణకు ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చలేదు: రేణుకా చౌదరి
- బిల్లును నిరసిస్తూ సభ నుంచి వైసీపీ వాకౌట్
న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోద ముద్రపడింది. అనంతరం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తరువాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. గురువారం రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు.
అనంతరం రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుపై చర్చకు అనుమతి ఇచ్చారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో 11 పార్టీలు నుంచి 18 మంది సభ్యులు పాల్గొన్నారు. అయితే వైసీపీ రాజ్యసభలో కూడా బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేసింది.
కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డితోపాటు ఎంపీలు రేణుకా చౌదరి(కాంగ్రెస్), నదీముల్ హక్ (టీఎంసీ), సంజయ్ సింగ్, సందీప్ కుమార్ పాఠక్ (ఆప్), నిరంజన్ బిషి (బీజేడీ), సంజయ్ యాదవ్ (ఆర్జేడీ), సంజయ్ కుమార్ ఝా (జెడీయు), బీద మస్తాన్ రావు, సానాసతీష్ (టీడీపీ), ప్రియాంక చతుర్వేది (శివసేన), కేఆర్ సురేశ్ రెడ్డి, రవి చంద్ర వద్దిరాజు (బీఆర్ఎస్), బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, పాక వెంకట సత్యనారాయణ తదితరులు చర్చలో పాల్గొన్నారు.
అనంతరం సభ్యులు లేవనెత్తిన అంశాలకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. తరువాత బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సి.పి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో బిల్లుపై చర్చను ఏపీ మంత్రి నారా లోకేష్ విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షించారు.
రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆటలు: రేణుకా చౌదరి
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చర్చను ప్రారంభిస్తూ.. రాజధాని బిల్లు రైతుల విజయమని అన్నారు. ఏపీ రాజధానిపై 12 ఏళ్లుగా అస్పష్టత ఉందన్నారు. అస్పష్టత వల్లే పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లాయని తెలిపారు. దుగరాజపట్నం, కడప స్టీల్ ప్లాంట్‌ను ముగిసిన అధ్యాయం చేశారంటూ మండిపడ్డారు. ‘‘బిల్లు పెట్టడం కాదు.. టైంకు రాజధాని పూర్తి చేసి చూపించాలి.
జగన్ మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారు. రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆటలు ఆడుతోంది. రూ. 1.47 లక్షల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు జరగలేదు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్బకాయిలు కేంద్రం ఇప్పించ లేదు. తెలంగాణకు ఇచ్చిన హామీలు కూడా కేంద్రం నెరవేర్చలేదు. కృష్ణా నదీ జలాల విషయంలోనూ అన్యాయం జరుగుతున్నది.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీ కూడా కేంద్రం ఇవ్వలేదు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన జాతీయ విద్యాసంస్థలు ఇంకా మంజూరు చేయలేదు. ఇప్పటివరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో కేంద్రం చెప్పాలి. హామీలు అమలు చేయనందుకు రెండు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలి’’ అని అన్నారు. ‘‘12 ఏళ్ల తరువాత కూడా ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదు. ఐదు గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందకుండా పోయాయి. భౌగోళికంగా ఏపీలో ఉన్నా.. ఆ గ్రామాలు ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్న వాళ్లను ఆంధ్రాలో కలిపారు’’ అని అన్నారు.
