- అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
- ఎఫ్‌సీడీఏ ఆఫీస్, యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ నిర్మాణ పనుల పరిశీలన
- పనుల పురోగతిని సీఎంకు వివరించిన ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా పరిపాలనా భవనం పూర్తికావాలని సూచించారు. ముచ్చర్ల సమీపంలో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పనులను గురువారం సీఎం రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేరళలో ఎన్నికల ప్రచారం ముగించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సీఎం.. నేరుగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ప్రధాన కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణాల వద్దకు చేరుకొని, ఆ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యాధునిక హంగులతో పరిపాలనా భవనం తుది మెరుగులు దిద్దుకుంటుండగా, అవసరమైన చోట్ల వేగం పెంచాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. జూన్‌కల్లా అందుబాటులోకి వచ్చేలా పనిచేయాలని సూచించారు.
ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం రేవంత్ తెలిపారు. ఎక్కడా నాణ్యత విష యంలో రాజీ పడకూడదని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్మాణాలు ఉండాలని స్పష్టం చేశారు.
- సోలార్.. బయోఫిలిక్ డిజైన్.. బయో డైవర్సిటీ
భవన నిర్మాణంలో పర్యావరణహితమైన ‘సస్టైనబుల్ డిజైన్’ పద్ధతులను పాటిస్తున్నట్టు సీఎం రేవంత్‌కు అధికారులు వివరించారు. భవనం పైకప్పు మీద ఫోటో వోల్టాయిక్ షేడ్స్ అమర్చారు. ఇవి సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా, లోపల సహజమైన చల్లదనాన్ని అందిస్తాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్స్, నీటి పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన ఎకో ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి రీచార్జి చేసే విధానం, వ్యర్థ జలాలను శుద్ధి చేసి మొక్కలకు వినియోగించడంలాంటివి పర్యావరణ పరిరక్షణకు అద్దం పడుతున్నాయి.
భవనం చుట్టూ ఉండే ల్యాండ్‌స్కేపింగ్‌లో దేశీయ మొక్కలకు ప్రాధాన్యత ఇస్తూ బయోడైవర్సిటీని కాపాడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్ క్వాలిటీ మెరుగుపరచడానికి బయోఫిలిక్ డిజైన్ ద్వారా లోపలి గదుల్లో కూడా పచ్చదనాన్ని నింపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణంలో వాడుతున్న గాజు ఫ్యాకేడ్ కేవలం అందం కోసమే కాకుండా, వెలుతురు ఉండడంతోపాటు ఉష్ణోగ్రతను తగ్గించేలా ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న కలెక్షన్ పాండ్ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మేలు జరిగేలా ప్లాన్ చేశారు. మొత్తానికి టెక్నాలజీని, ప్రకృతిని మేళవించి నిర్మిస్తున్న ఈ భవనం ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ సింబల్‌గా నిలువనున్నది.
గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక పెట్టుబడులు, కీలక ఒప్పందాలన్నీ ఈ ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయం నుంచే జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఎఫ్‌సీడీఏ భవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, దీనిని ఒక ఐకానిక్ స్ట్రక్చర్‌గా నిర్మించాలని ఇంజినీర్లను కోరారు. ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలు ఇక్కడికి వచ్చినప్పుడు మన నగరం వైభవం ప్రతిబింబించేలా ఈ భవన నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఎఫ్‌సీడీఏ భవన నిర్మాణం పూర్తయితే ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ విజన్ సాకారమయ్యే క్రమంలో ఈ పరిపాలన భవనం తొలి అడుగుగా నిలుస్తుంది. కేవలం కార్యాలయం మాత్రమే కాకుండా, ఇది ఒక నాలెడ్జ్ హబ్‌గా కూడా సేవలందిస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది. ఐటీ, ఫార్మా, ఇతర రంగాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ఇక్కడ ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ హాల్స్‌ను సిద్ధం చేస్తున్నారు.
