ఇవాళ్టి నుంచే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఇవాళ్టి నుంచే  మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

మహబూబ్​నగర్​/శ్రీశైలం, వెలుగు: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబైంది. శనివారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనుండగా,  తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి దాదాపు 8 లక్షల మంది భక్తులు రానున్నారు. ఈ మేరకు ఎండోమెంట్, ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  కాగా, మార్గమధ్యలోని నల్లమల యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి  శైవక్షేత్రాలను సందర్శిస్తూ భక్తులు  తన్మయత్వంలో మునిగిపోతే, జంగిల్​ రైడ్​లతో పర్యాటకులు సేదదీరవచ్చు.  ఇప్పటికే కాలినడకన వచ్చే శివదీక్షాపరుల హర నామస్మరణతో అడవి దారులన్నీ మారుమోగుతున్నాయి.

18న లింగోద్భవం.. 

శనివారం నుంచి క్షేత్రంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు ఉదయం యాగశాల ప్రవేశం, రుద్రపారాయణం, సాయంత్రం అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ, రాత్రి భేరి పూజా, ధ్వజారోహణం నిర్వహిస్తారు. 12న ప్రత్యేక పూజలతో పాటు భృంగి వాహన సేవ, 13న హంస వాహన సేవ, 14న సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్ర్తాల సమర్పణ, మయూర వాహన సేవ, 15న రావణ వాహన సేవ సాయంత్రం ఏపీ ప్రభుత్వం నుంచి పట్టు వస్ర్తాల సమర్పణ, 16న పుష్ప పల్లకీ సేవ, 17న గజ వాహన సేవ, 18న (మహా శివరాత్రి) రాత్రి నంది వాహన సేవ, పది గంటలకు లింగోద్భవం, పాదాలంకరణ, అర్ధరాత్రి భ్రమరాంబ, మల్లికార్జునుల కల్యాణోత్సవం, 19న రథోత్సవం, అదే రోజురాత్రి ఎనిమిది గంటలకు తెప్పోత్సవం, 20న పూర్ణాహుతి, 21న ఉదయం చండీశ్వర పూజ, మండపారాదన, అర్చన, రాత్రి అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఆకర్షిస్తున్న నల్లమల..

ఇటు శైవక్షేత్రాలు, అటు ప్రకృతి అందాలకు నల్లమల పుట్టినిల్లు. హైదరాబాద్​, మహబూబ్​నగర్​ ప్రాంతాల మీదుగా వచ్చే యాత్రికులు ఉమామహేశ్వరం, మద్దిమడుగు, మన్ననూరు వద్ద చెంచు మ్యూజియం, జంగిల్​ సఫారి, ప్రతాప రుద్రుని కోట, లొద్ది, ఫరహాబాద్​ వ్యూ పాయింట్​, మల్లెలతీర్థం, అక్టోపస్​ వ్యూ పాయింట్, శ్రీశైలం డ్యామ్ ​చూడవచ్చు. ఏపీ నుంచి వచ్చే యాత్రికులు వెంకటాచలం టెంపుల్​, బైర్లూటి జంగిల్​ రైడ్​, తుమ్మల బైలు జంగిల్​ రైడ్​, ఇష్టకామేశ్వరి ఆలయం, శిఖరం, పాలధార పంచధార, అటకేశ్వరం, సాక్షి గణపతి ఆలయాలను దర్శించుకోవచ్చు.

ఏర్పాట్లు ఫుల్​..

11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులను తరలించేందుకు టీఎస్​ఆర్టీసీ, ఏపీఎస్​ఆర్టీసీ, కేఎస్​ఆర్టీసీ 820 ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్​, మహబూబ్​నగర్​, కర్నూల్​, ప్రకాశం, విజయవాడ, కర్ణాటక నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నారు.   శ్రీశైలంలో భక్తులు స్నానాలు చేసేందుకు  బాత్​రూంలు, టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చారు. తాగునీటి కోసం 11 రోజుల పాటు 30 లక్షల గ్యాలెన్ల  నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 29 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు.  భక్తుల కోసం 30 లక్షల లడ్డూలను సిద్ధం చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.