ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న సమాచారం మేరకు అధికారులు ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్(SID)కు శనివారం సాయంత్రం ఈ విషయమై సమాచారం అందడంతో భద్రతను పెంచారు. ఇప్పటికే ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కలిగి ఉన్న సీఎం షిండేకు అదనపు భద్రత కల్పించినట్లు చెప్పారు. ముంబయిలోని షిండే అధికారిక నివాసం 'వర్షా'తో పాటు ఠాణెలోని వ్యక్తిగత నివాసం వద్ద కూడా సెక్యూరిటీ పెంచినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్ డుంబ్రే తెలిపారు.
ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు పదే పదే బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేయాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితుడిని కనిపెట్టేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్ (సీపీ), ఇంటెలిజెన్స్ కమిషనర్ లను ఫడ్నవీస్ కోరారు.
మరోవైపు ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని సీఎం షిండే అన్నారు. హోంశాఖ, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. మహారాష్ట్ర ప్రజల కోసం తన పని తాను చేసుకుంటూపోతానని, భద్రత విషయాన్ని అధికారులు చూసుకుంటారని పేర్కొన్నారు.
