మరాఠ ప్రజలకు కొత్త సీఎం షిండే బంపరాఫర్‌

మరాఠ ప్రజలకు కొత్త సీఎం షిండే బంపరాఫర్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే సోమవారం(జులై 4న)  రాష్ట్ర ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ప్రజా ఆకర్షణ చర్యల్లో భాగంగా ఇంధన ధరలను తగ్గిస్తామని చెప్పారు. కొత్త కేబినెట్ సమావేశం తర్వాత పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తామన్నారు. దీనిపై కేబినెట్‌ తర్వలోనే నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గత ఏడాది నవంబర్‌లో, కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, రూ.10 తగ్గించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించాయి.

మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వ్యాట్‌ను మరింత తగ్గించాయి. అయితే.. ప్రజలకు ఉపశమన చర్యగా ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించాలన్న ప్రధాని సూచనను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తిరస్కరించాయి. మహారాష్ట్రలో ఇంతకుముందు ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్‌ వ్యాట్‌ను తగ్గించలేదు. తాజాగా ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించనున్నట్టు తెలిపింది. సోమవారం (జులై 4న) సీఎం ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో నిర్వహించిన బల నిరూపణలో పూర్తి మెజార్టీతో విజయం సాధించారు.

మరోవైపు మంత్రివర్గ విస్తరణపై సీఎం ఏక్ నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గ విస్తరణ ఎలా ఉంటుందో చూడాలన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేలు తరచూ కోర్టులకు వెళ్తున్నారని, ఈ రోజు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారని కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అసెంబ్లీలో తనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలందరూ రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 200 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తుందని, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం షిండే చెప్పారు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ (ప్రస్తుతం డిప్యూటీ సీఎం) ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుందని, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం కూడా మెట్రో ప్రాజెక్టు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ త్వరగా నిర్ణయాలు తీసుకుని, గడువులోపే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.