జూటా వార్త రాసిందంటూ ఓ పత్రికను తగలబెట్టిన రైతులు

జూటా వార్త రాసిందంటూ ఓ పత్రికను తగలబెట్టిన రైతులు

మహాదేవపూర్,వెలుగు : ‘మేడిగడ్డ బ్యారేజీతో మా పొలాలన్నీ మునుగుతుంటే చూస్తూ ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను గ్రేట్ అని ఎట్లా అంటం.. ఆయనను పీఎం కావాలని ఎట్లా కోరుకుంటం.. ఆ పేపర్ల(వెలుగు కాదు) అన్నీ జూటా మాటలు రాసిన్రు’ అంటూ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాకు చెందిన మేడిగడ్డ ముంపు బాధిత రైతులు మండిపడ్డారు. పత్రికపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని సిరోంచ తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చారు.

తెలంగాణ సీఎం కేసీఆర్​ దేశ ప్రధాని కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టు టీఆర్ఎస్​కు చెందిన అధికారిక పత్రిక మెయిన్​ పేజీలో సోమవారం స్టోరీ పబ్లిష్​ చేశారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే మహారాష్ట్ర కూడా బాగుపడుతుందని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలోని పబ్లిక్ ​కోరుకుంటున్నట్లు రాశారు. అరుడ, మద్దికుంట సర్పంచ్ ల ఫొటోలతో వాయిస్ ప్రచురించారు. కానీ తాము ఎలాంటి వాయిస్ ఇవ్వలేదని, తమ ఫొటోలు తీసుకొని తమను సంప్రదించకుండానే ఇష్టమున్నట్లు రాసుకొని పబ్లిష్​ చేశారంటూ సర్పంచులు, గ్రామస్తులు మండిపడ్డారు.

సిరోంచ తాలూకా కేంద్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా నినదిస్తూ పేపర్​ ప్రతులను తగులబెట్టారు. మహారాష్ట్ర వైపు మేడిగడ్డ బ్యారేజీ వల్ల 2 వేల ఎకరాలు ముంపునకు గురైతే  నష్ట పరిహారం ఇవ్వని తెలంగాణ సీఎంను ఎట్లా దేశానికి పీఎం కావాలని కోరుకుంటామని నిలదీశారు. పత్రిక యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతామన్నారు. అక్టోబర్ 3 లోగా ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మేడిగడ్డ బ్యారేజీ పై ధర్నా చేస్తామని హెచ్చరించారు. రంగు బాపు అరుడ మాజీ ఉప సర్పంచ్, రాయిల పాపయ్య మద్దికుంట మాజీ సర్పంచ్, రైతునాయకులు తిరుపతి ముద్దం మద్దికుంట, శ్రీనివాస్ రంగు, సూరజ్ పాల్గొన్నారు.