ఎలన్ మస్క్‎ స్టార్ లింక్‎తో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం

ఎలన్ మస్క్‎ స్టార్ లింక్‎తో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం

ముంబై: ప్రపంక కుబేరుడు ఎలాన్‌ మస్క్ స్పేస్‌ఎక్స్ కంపెనీ యాజమాన్యంలోని స్టార్‌లింక్‎తో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల కోసం స్టార్ లింక్‎తో మహారాష్ట్ర సర్కార్ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ మేరకు స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్(LOI)పై బుధవారం (నవంబర్ 5) సంతకం చేసింది. తద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ కోసం స్టార్ లింక్‎తో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహా సర్కార్ నిర్ణయం ఇండియాలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను విస్తరించడానికి దోహదపడనుంది.

ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. గడ్చిరోలి, నందూర్బార్, వాషిమ్, ధరాశివ్ వంటి మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలు, కీలకమైన ప్రజా మౌలిక సదుపాయాల కోసం ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అమలు చేయడానికి స్టార్‌లింక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని పేర్కొన్నారు. స్టార్ లింక్ ఇండియాలో సేవలు ప్రారంభించడం.. అందులోనూ మహారాష్ట్రతో భాగస్వామ్యం కలిగి ఉండటం మాకు గౌరవమని అన్నారు.

 స్టార్‌లింక్ సహకారం రాష్ట్ర ప్రధాన డిజిటల్ మహారాష్ట్ర మిషన్‌కు మద్దతు ఇస్తుందని.. ఎలక్ట్రిక్ వాహనాలు, తీరప్రాంత అభివృద్ధి, విపత్తు స్థితిస్థాపక కార్యక్రమాలతో అనుసంధానించబడుతుందని తెలిపారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంతో ఉపగ్రహ ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాలలో మహారాష్ట్ర భారతదేశాన్ని నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా మిషన్‌కు అట్టడుగు స్థాయిలో ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుందన్నారు.