పసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మహారాష్ట్ర ఎమ్మెల్యే

పసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మహారాష్ట్ర ఎమ్మెల్యే

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరుగుతున్న శీతాకాల సమావేశాలకు ఓ మహిళా ఎమ్మెల్యే చంటిపాపతో హాజరయ్యారు. నాసిక్ కు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే తన రెండున్నర నెలల వయసున్న పసిబిడ్డతో సమావేశాలకు వచ్చారు. తాను తల్లిని, దాని కంటే ముందు ప్రజాప్రతినిధిని అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నరేళ్లుగా నాగ్‌పూర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరగలేదన్నారు. తాను ఇప్పుడు తల్లినైనా కూడా తన ప్రజా సమస్యలను చెప్పడానికి, ప్రశ్నలు లేవనెత్తడానికి వచ్చానని చెప్పారు. వాటికి సమాధానాలు పొందడానికి తన బిడ్డతో అసెంబ్లీకి వచ్చానని అహిరే స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే సరోజ్ అహిరే సెప్టెంబర్ 30న మగబిడ్డకు జన్మనిచ్చారు. చంటిబిడ్డతో ఎమ్మెల్యే సమావేశాలకు రావడంతో.. అక్కడే ఉన్న కొందరు ఆ చిన్నారితో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. చిన్నారిని ఎత్తుకొని వస్తున్న ఎమ్మెల్యే అహిరేకు సంబంధించిన ఫొటోలు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.