
ఆసిఫాబాద్,వెలుగు: తాగిన మైకంలో ఓ మహారాష్ట్ర ఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో పశువుల సంతలో హల్‌చల్ చేశాడు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గణేశ్‌పూర్ పశువుల సంతలో బుధవారం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజురా పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న వినయ్ సింగ్ గొల్మాడు, అదే ఠాణాలో కానిస్టేబుల్ మహేశ్ భోయార్‌తో కలిసి గణేశ్‌పూర్ సంతకు వచ్చారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువుల వ్యాన్ వచ్చిందంటూ హల్‌చల్ చేశారు.
తప్పతాగి మత్తులో ఉన్న అతను వ్యాపారులు, ప్రజలతో గొడవ పడుతూ రివాల్వర్‌తో బెదిరిస్తూ వీరంగం వేశాడు. స్థానికులు సమాచారం అందించడంతో వాంకిడి ఎస్సై చంద్రశేఖర్ అక్కడకు చేరుకొని మహారాష్ట్ర ఎస్సై, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పోలీసు ఉన్నతాధికారులకు వివరాలు తెలిపారు. తాగి హల్‌చల్ చేసిన సిబ్బందిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి చంద్రపూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాలతో వారిద్దరిని మహారాష్ట్రలోని రాజురా సీఐకు అప్పగించినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.