మహారాష్ట్రలో పోటాపోటీగా రాజకీయ పార్టీల ఆఫర్లు

మహారాష్ట్రలో పోటాపోటీగా రాజకీయ పార్టీల ఆఫర్లు
  •     దహీహండీకి ‘అడ్వెంచర్ ​స్పోర్ట్’ కోటా ఇస్తం: షిండే
  •     మహారాష్ట్రలో పోటాపోటీగా రాజకీయ పార్టీల ఆఫర్లు

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు దహీ హండి (ఉట్టి కొట్టే పోటీలు) పై పోటాపోటీగా ప్రైజులు ప్రకటించాయి. కృష్ణాష్టమి సందర్భంగా ముంబై, నాసిక్​ తదితర ప్రాంతాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే పోటీల్లో గెలిచిన వారికి ఒకరినిమించి ఒకరు ఆఫర్లు ఇచ్చారు. విజేతగా నిలిచే టీంలకు రూ.55 లక్షల ప్రైజ్​మనీని మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన (ఎంఎన్ఎస్) ప్రకటించింది. ఇప్పటిదాకా ఉన్న వరల్డ్​ రికార్డును బ్రేక్​ చేసినా, సమం చేసినా విన్నర్లకు స్పెయిన్​లో పర్యటించే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఇక దహీ హండీకి ‘అడ్వెంచర్ ​స్పోర్ట్’ స్టేటస్ తో పాటు, పోటీల్లో పాల్గొన్నవాళ్లకు స్పోర్ట్స్​ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని షిండే సర్కారు నిర్ణయించింది. ‘‘పోటీల్లో పాల్గొన్న వ్యక్తి చనిపోతే, ఆ వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షల బీమా అందజేస్తం. సీరియస్​గా గాయపడిన వ్యక్తికి రూ.7 లక్షలు, ఫ్రాక్చర్ ​వంటి గాయాలైన వ్యక్తికి రూ.5 లక్షలు ఇస్తం” అని వెల్లడించింది. 

సేన వర్సెస్​ సేన

దహీ హండీ పోటీలను అత్యంత గ్రాండ్​గా నిర్వహించి ఆ క్రెడిట్​ను తమ ఖాతాలోకి వేసుకోవడానికి ఏక్​నాథ్​ షిండే వర్గం, ఉద్ధవ్  ఠాక్రేకు చెందిన శివసేన వర్గం తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఠాణేలో తాను నిర్వహించే దహీ హండీ పోటీల విజేతకు రూ.21 లక్షలు అందిస్తామని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్​సర్​ నాయక్​ ప్రకటించారు. ఠాణేలో బాలాసాహెబ్​ పేరిట ఒక హండీ(ఉట్టి), ఆనంద్​ దిఘే పేరిట మరో హండీ ఏర్పాటు చేస్తామని, ఆ రెండు పోటీల్లో విజేతలకు రూ.11 లక్షల చొప్పున ఇస్తామని శివసేన మరో లీడర్ ​విచారే ప్రకటించారు. అలాగే ముంబై, ఠాణేల్లో విజేతల బృందానికి రూ.2.51 చొప్పున క్యాష్​ప్రైజ్​ అందిస్తానని షిండే వర్గం తెలిపింది.

బీజేపీ వర్సెస్​శివసేన

తాము కూడా దహీ హండీ పోటీలను ఘనంగా నిర్వహించి క్రెడిట్​ను దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాబోయే బీఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇప్పటికే ముంబై నగరమంతటా ఆ పార్టీ 370 దహీ హండీ కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పటిదాకా దహీ హండీతో సంబంధంలేని బీజేపీ.. మొదటిసారిగా ఇటువంటి ప్రోగ్రామ్​లు నిర్వహించింది. శివసేనకు పట్టున్న పార్లే, లాల్​బాగ్, దాదర్, గిర్​గామ్​లో కూడా ఇటువంటి కార్యక్రమాలే ఆర్గనైజ్​ చేసింది. దహీ హండీలో పాల్గొన్న 20 వేల మందికి బీజేపీ రూ.10 లక్షల చొప్పున బీమా చేయడం విశేషం. ఇక ముంబైలోని శివసేన ఆఫీసు ముందు ‘నిష్టా దహీ హండీ’ కార్యక్రమం నిర్వహించింది. 1960, 70 దశకాల నుంచి శివసేన ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.  బీఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దహీ హండీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి, లబ్ధి పొందాలని బీజేపీ, శివసేన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.