‘కష్టపడే వారికే డీసీసీలో చోటు కల్పించాలి’ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

‘కష్టపడే వారికే డీసీసీలో చోటు కల్పించాలి’ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు డీసీసీ కార్యవర్గంలో పెద్దపీట వేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను, ఏఐసీసీ అబ్జర్వర్లను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. బుధవారం ఈ ఇద్దరు నేతలు జూమ్ మీటింగ్ నిర్వహించి తెలంగాణలోని అన్ని జిల్లాల డీసీసీ చీఫ్​లతో కార్యవర్గ నియామకాలపై పలు సూచనలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ నెల 25లోపు అన్ని డీసీసీ కార్యవర్గాలను నియమించి జాబితాను పీసీసీకి పంపించాలని ఆదేశించారు. 

ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై దృష్టి పెట్టాలని, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని సూచించారు. పార్టీలో సిన్సియర్​గా పనిచేస్తున్న కార్యకర్తలకు టికెట్లు కేటాయించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని డీసీసీ చీఫ్​లను పీసీసీ అధ్యక్షుడు, పార్టీ ఇన్​చార్జ్ కోరారు. ఇక జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడంతో పాటు ఈ స్కీమ్ ను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్న కేంద్రం తీరును ఎండగట్టాలని కోరారు.